'కందిరీగ' తుర్ మంది!
బెల్లంకొండ సురేష్ దమ్మున్న నిర్మాతే కానీ లెక్కలు మించిన ప్రాజెక్టులు తలకెత్తుకోవడం వల్లనే ఏమో కానీ అప్పుడప్పుడు ప్లానింగ్ దెబ్బతింటోంది. అనుకున్న సమయానికే కొత్త సినిమాల పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి కానీ కొన్ని సెట్స్ కు రాకుండానే ఆయన చేజారిపోతున్నాయి. ఆ మధ్య బాలకృష్ణతో 'భీష్మ' చిత్రానికి ప్రకటించి, పూజా కార్యక్రమాలు, పోస్టర్ రిలీజ్ కూడా చేసినప్పటికీ పట్టాల మీదకు తీసుకురాలేకపోయారు. దీంతో బాలకృష్ణ వేరే బ్యానర్ లో 'సింహా' చిత్రం వైపు వెళ్లిపోయారు. తాజాగా రవితేజ-కృష్ణవంశీలతో అనౌన్స్ చేసిన 'కందిరీగ' కూడా తుర్రుమందట.
రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ చిత్రం సుమారు ఓ మూడు నాలుగు నెలల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకొంది. అప్పట్నించీ ఆ సినిమా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిజానికి బెల్లంకొండతో వరుసగా రెండు సినిమాలకు రవితేజ కమిట్ అయ్యారట. అందుకు భాగంగానే రవితేజ-బెల్లంకొండ కాంబినేషన్ లో 'శంభో శివ శంభో' చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెండో చిత్రంగా 'కందిరీగ'ను ప్లాన్ చేసినప్పటికీ సినిమా సెట్స్ కు రావడంలో తలెత్తిన విపరీతమైన జాప్యం రవితేజ, కృష్ణవంశీని ఆలోచింపజేసిందట. ఫలితంగానే ఈ చిత్రం గత వారంలో మరో ముహూర్తం జరుపుకొంది. అయితే దీనికి బెల్లంకొండ మాత్రం నిర్మాత కాదు. ఏతావాతా 'కందీరీగ' బెల్లంకొండ చేతిలోంచి ఎగిరిపోయింది.
Be first to comment on this News / Article!
|