పవన్ కల్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాకుండానే గత ఏడాది ముగియడం ఆయన అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఈ ఏడాది మాత్రం పవన్ నుంచి రెండు రిలీజ్ లను ఆశించవచ్చు. పవన్ ప్రస్తుతం 'ఖుషి' ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో 'కొమురం పులి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వాలంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఆ చిత్ర నిర్మాత సింగనమల రమేష్ ఉన్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ నటించే సినిమా ఏదనేది ఇంకా కన్ ఫర్మ్ కానప్పటికీ వరుస ప్రాజెక్ట్ లు ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. నటుడు-నిర్మాత గణేష్ బాబు ఇప్పటికే పవన్ తో ఓ సినిమా ప్రకటించినప్పటికీ కొద్దికాలంగా ఆ సినిమా ఊసేలేదు. ఆ మాట ఎలా ఉన్న ప్రస్తుతం పవన్ తో '3 ఇడియట్' రీమేక్ కు ఆ చిత్రం రైట్స్ తీసుకున్న జెమినీ ఫిలిం సర్క్యూట్స్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. హిందీ ఒరిజనల్ లో అమీర్ ఖాన్ చేసిన పాత్రను పవన్ చేత చేయించాలని జెమినీ సంస్థ భావిస్తోంది. దర్శకుడిగా ప్రభుదేవా పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం కూడా ఉంది. ఈ చిత్రంతో పాటు సంచలన దర్శకుడు వి.వి.వినాయక్ తో ఓ కొత్త చిత్రానికి కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
వినాయక్ ఇటీవల పవన్ కు చెప్పిన స్టోరీలైన్ ఆయనకు బాగా నచ్చిందనీ, వెంటనే తన సమ్మతి తెలియజేశారనీ అంటున్నారు. పవన్ తో 'జల్సా' వంటి హిట్ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశాలున్నాయి. ఇతర వివరాలు త్వరలోనే వెలుగు చూడనున్నాయి.