'అదుర్స్'ను ఆదరించండి!
నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే చస్తా. నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. అన్ని ప్రాంతాల వారు ఆదరించబట్టే ఈ స్థాయికి చేరాను. అదుర్స్ ను సైతం మీరంతా ఆదరించండి. మీ ప్రేమ, వాత్సల్యం, అభిమానం నా మీద చూపండి. సినిమాను అడ్డుకోవద్దు' అని జూనియర్ ఎన్టీఆర్ చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై ఎన్టీఆర్ తన వైఖరి వివరించని పక్షంలో 'అదుర్స్' చిత్ర ప్రదర్శనను తెలంగాణలో అడ్డుకుంటామని తెలంగాణ వర్శిటీల విద్యార్థి జెఎసి, జనజాగృతి సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట కవిత చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ తన వివరణతో కూడిన రికార్డెడ్ క్యాసెట్ ను మీడియాకు పంపారు.
ప్రాంతీయ విభేదాలతో తాను నటించిన 'అదుర్స్' చిత్రాన్ని అడ్డుకోవద్దనీ, మీ ప్రేమాభిమానాలు చూపించి ఆదరించాలనీ ఎన్టీఆర్ ఈ సందర్భంగా కోరారు. కొందరు తమ తమ అభిప్రాయాలతో అపోహలు కలిగిస్తున్నారనీ, ఆ ప్రభావం పరిశ్రమపై పడుతోందనీ, ఇందవల్ల హీరోలు, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులతో సహా ఈ రంగంలోని అందరూ ఇబ్బందులు పడుతున్నారనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెన్నైకి తరలి పోయే అవసరమే లేదని ఆయన తెగేసి చెప్పారు. తమ పూర్వీకులు...తాతయ్య ఎన్టీఆర్ నుంచి ఎందరో సీనియర్లు కష్టపడి పరిశ్రమను హైదరాబాద్ కు తెచ్చారనీ, ఆయన వారసుడుగా, ఆయన కుటుంబంలో పుట్టినందుకు ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తమ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు హైదరాబాద్ లోనే ఉన్నాయనీ, ఇక్కడే స్థిరపడ్డామనీ, ఎక్కడికీ కదలే ప్రసక్తే లేదనీ అన్నారు. తాను ఇక్కడే సినిమాలు చేస్తాననీ, తనతో సినిమాలు తీయాలనుకునే వాళ్లు కూడా ఇక్కడకే రావాలనీ తేల్చిచెప్పారు. ప్రత్యేక రాష్ట్రం విషయాన్ని ముచ్చటిస్తూ, కలిసి ఉండాలన్నా, విడిపోవాలన్నా నిర్ణయం తీసుకోవాల్సింది రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలేనని అన్నారు. ఒక హీరోనో, దర్శకుడో తీసుకునే నిర్ణయం ఎంతమాత్రం కాదన్నారు. ఈనెల 13న 'అదుర్స్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. నైజాంలోనూ థియేటర్ల జాబితా ప్రకటించారు.
Be first to comment on this News / Article!
|