కోర్టులో 'యుగానికి ఒక్కడు'
కార్తీక్ (సూర్య సోదరుడు), రీమాసేన్ ప్రధాన పాత్రల్లో 45 కోట్ల భారీ బడ్జెట్ తో సెల్వరాఘవన్ దర్శకత్వంలో సుమారు రెండున్నరేళ్ల పాటు నిర్మాణం జరుపుకొన్న 'ఆయరత్తిల్ ఒరువన్' (తెలుగులో యుగానికి ఒక్కడు) చిత్రం విడుదలపై చెన్నైలోని సివిల్ కోర్టు స్టే ఇచ్చింది. పొంగల్ కానుకగా ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా నిర్మాత రవీంద్రన్, దర్శకుడు సెల్వరాఘవన్ పై శ్రీ శరవణ క్రియేషన్స్ కు చెందిన సేలం ఎ.చంద్రశేఖర్ కోర్టులో కేసు వేశారు.
'కాశిమేడు' అనే చిత్రానికి పని చేసేందుకు తనతో అగ్రిమెంట్ చేసిన సెల్వరాఘవన్ 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నారనీ, ఇది తెలిసి కూడా 'ఆయరత్తిల్ ఒరువన్' చిత్రానికి సెల్వరాఘవన్ తో రవీంద్రన్ అగ్రిమెంట్ చేయించుకున్నాడని చంద్రశేఖర్ తన పిటిషన్ లో కోర్టుకు ఫిర్యాదు చేశారు. సెల్వ రాఘవన్ తన సినిమా పూర్తి చేయలేదనీ, కనీసం అడ్వాన్స్ సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదనీ ఆయన కోర్టుకు విన్నవించారు. దీంతో ఈనెల 20వ తేదీ వరకూ సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ఈలోగా కోర్టు బయట వ్యవహారం సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో సినిమా విడుదలలో మరికొంత జాప్యం తప్పదు.
Be first to comment on this News / Article!
|