సంక్రాంతి సెంటిమెంట్ జంట
సంక్రాంతికి తమ సినిమాలు విడుదలైతే తప్పనిసరిగా హిట్టవుతాయనే సెంటిమెంట్ పరిశ్రమలో చాలా మందికి ఉంది. అందులో విక్టరీ వెంకటేష్, గ్లామర్ నటి త్రిష కూడా ఉన్నారు. ఆసక్తికరంగా ఈ ఇద్దరూ జంటగా నటించిన 'నమో వెంకటేశ' చిత్రం సంక్రాంతి కానుకగానే ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో సహజంగానే సక్సెస్ సెంటిమెంట్ ఈసారి కూడా పునరావృతం కానుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది.
వెంకటేష్ కథానాయకుడుగా నటించిన 'కలిసుందాం రా' చిత్రం అప్పట్లో సంక్రాంతి పండుగకే రిలీజ్ అయి పెద్ద హిట్టయింది. ఆ తర్వాత ఆయన నటించిన 'లక్ష్మీ' చిత్రం కూడా ఇదే పండుగకు విడుదలై విజయవంతమైంది. త్రిష విషయానికి వస్తే ఆమె నటించగా సంక్రాంతి పండుగకు రిలీజైన రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. వీటిలో ప్రభాస్ తో నటించిన 'వర్షం', సిద్ధార్ధకు జోడిగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాలున్నాయి. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు నిర్మించడంతో ఆయనకు సంక్రాంతి రాజనే పేరు కూడా స్థిరపడింది. సంక్రాంతి సెంటిమెంట్ ఈసారి కూడా ఫలించి వెంకటేష్, త్రిష జంటగా నటించిన 'నమో వెంకటేశ' హిట్టయితే ఈ జంటకు హిట్ పెయిర్ అనే పేరు కూడా స్థిరపడుతుంది. 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' వంటి హిట్ తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది.
Be first to comment on this News / Article!
|