నమో వెంకటేశ ఆడియో సక్సెస్
వెంకటేష్-త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'నమో వెంకటేశ' చిత్రం ఈనెల 14న విడుదలకు సిద్ధమైంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం రాత్రి జరిగింది. డాక్టర్ డి.రామానాయుడు, సురేష్ బాబు, వెంకటేష్, దేవీశ్రీప్రసాద్, శ్రీనువైట్ల, రామజోగయ్య శాస్త్రి, గోపిమోహన్, చింతపల్లి రమణ, ప్రసాద్ మూరెళ్ల, అభిమానులు పెద్ద సంఖ్యంలో పాల్గొన్నారు. దేవీశ్రీప్రసాద్ నేతృత్వంలో చిత్రంలోని పాటలను డాన్సర్లు ప్రదర్శించగా, వెంకటేష్, డి.రామానాయుడుతో దేవీశ్రీ కొన్ని స్టెప్స్ వేయించి అందర్నీ ఉర్రూతలూగించారు.
రామానాయుడు మాట్లాడుతూ, వెంకటేష్ బాబు నటించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా బాగున్నాయనీ, సినిమా కూడా బాగా వచ్చిందనీ అన్నారు. సినిమా కూడా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. చాలా త్వరతిగతిన ఈ చిత్రాన్ని పూర్తి చేశామనీ, దేవీశ్రీ అద్భుతమైన సంగీతం అందించారనీ సురేష్ బాబు పేర్కొన్నారు. 14న విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ విశ్వరూపం ప్రదర్శించారని శ్రీనువైట్ల పేర్కొన్నారు. ఈ చిత్ర నిర్మాతలు తన స్నేహితులనీ, చిరకాలం గుర్తుండిపోయే సినిమా తీయాలనే వారి కోరిక ఈ చిత్రంతో నెరవేరిందనీ అన్నారు. దానికి కారకులైన వెంకటేష్ బాబు, సురేష్ బాబుకు కతజ్ఞతలు తెలుపుకొంటున్నానని అన్నారు. అలాగే దేవీశ్రీప్రసాద్ చాలా చక్కటి సంగీతం అందించరానీ, వెంకటేష్ కు సరైన కథ కావాలనుకున్నప్పుడు అలాంటి కథనే గోపీ మోహన్ అందించారని, ఏడాది పాటు ఆయన తనతో నే ఉన్నారనీ పేర్కొన్నారు. చింతపల్లి రమణ మాటలు, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఎక్స్ లెంట్ గా కుదిరాయని అన్నారు. దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ, శ్రీనువైట్ల తన అన్నయ్యలాంటి వాడనీ, ఆయన దర్శకత్వంలో తాను పనిచేసిన సినిమాలు పెద్ద హిట్లయ్యాయనీ అన్నారు. శ్రీనువైట్ల, వెంకటేష్ ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలనే ఫిలాసపీ కలిగిన వ్యక్తులని ప్రశంసించారు. టైటిల్ సాంగ్ లోని ఓ బిట్ కు రామజోగయ్య శాస్త్రి కొరియోగ్రఫీ అందించరాని చెప్పారు. వెంకటేష్ మాట్లాడుతూ, ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతోందనీ, దేవి అందించిన సంగీతం హిట్ అయిందనీ అన్నారు. శ్రీనువైట్లతో పనిచేయాలని ఎప్పట్నించో అనుకుంటున్నాననీ, మంచి కథ దొరకడంతో ఇప్పటికి సాధ్యమైందనీ అన్నారు. యూరప్, ఐస్ లాండ్, బ్యాంకాక్ లలో పాటల చిత్రీకరణ జరిగిందన్నారు. పాజిటివ్ థింకింగ్ ప్రాధాన్యాన్ని ఇందులో చెప్పామని అన్నారు. త్రిష ఈ కార్యక్రమానికి రాలేకపోయినప్పటికీ ఆమె మాట్లాడిన క్లిప్లింగ్స్ ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
Be first to comment on this News / Article!
|