'అదుర్స్'కు పచ్చెజెండా
ఎన్టీఆర్ 'అదుర్స్' చిత్రం విడుదలపై కొద్దిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి పలు నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు తెరపడింది. చిత్ర నిర్మాతలు ప్రకటించిన విధంగానే ఈనెల 13న సినిమా విడుదల చేసుకోవచ్చని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో థియేటర్ల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య సినిమా ప్రదర్శనకు మార్గం సుగమమైంది.
తొలుత తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పేంతవరకూ 'అదుర్స్' చిత్రాన్ని నైజాంలో అడ్డుకుంటామంటూ తెలంగాణ వర్శిటీల విద్యార్థి జెఎసి, జనజాగృతి నుంచి హెచ్చరికల నేపథ్యంలో 'అదుర్స్' విడుదలపై కొద్దిరోజులుగా ప్రతిష్ఠంభన నెలకొంది. క్రిస్మస్ కు విడుదల కావాల్సిన ఈ చిత్రం మరో వాయిదా తీసుకుని ఎట్టకేలకు సంక్రాంతి కానుకగా 13న రిలీజ్ కు సిదధమైంది. దీంతో మళ్లీ 'ప్రతిఘటన' తప్పదనే హెచ్చరికలు ఊపందుకున్నాయి. సినిమాను అడ్డుకోరాదని మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు తెలంగాణవాదులకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ సైతం తాను ఇక్కడే (హైదరాబాద్)లో పుట్టాననీ, ఇక్కడే చస్తాననీ, అన్ని ప్రాంతాల వారి అభిమానం వలనే తాను ఇంతవాడినయ్యాననీ బహిరంగ ప్రకటన చేశారు. ఎప్పటిలాగానే తనపై ప్రేమాభిమానులు చూపించి తన సినిమాను అడ్డుకోకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన సినిమాకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని మంగళవారం తెల్లవారుజామున తిరుమలలోని శ్రీవారికి ప్రత్యేక పూజలు కూడా జరిపించారు. అయితే ఎన్టీఆర్ వివరణతో తృప్తపడని టిఆర్ఎస్ శ్రేణులు ఆయన తెలంగాణకు జై కొట్టేంతవరకూ సినిమా ఆడనీయమంటూ హైద్రాబాద్ లోని రెండు థియేటర్ల వద్ద కటౌట్లు ధ్వసం చేశారు. ఈ పరిణామాలనునిశితంగా గమనించిన చిత్ర నిర్మాత వల్లభనేని వంశీ, సమర్పకుడు కొడాలి నాని హైకోర్టును ఆశ్రయించారు. థియేటర్ల వద్ద గట్టి భద్రత కల్పించాలని కోరుతూ, జెఎసి నేతలు, రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదంరామ్ లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై విచారణ చేపట్టని హైకోర్టు ధర్మాసనం డిజిపి ఆర్.ఆర్.గిరీష్ కుమార్ కు నివేదిక సమర్పించమని ఆదేశించడం, ఆయన నివేదిక సంపృత్తికరంగా ఉండటంతో 13న సినిమా ప్రదర్శనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'అదుర్స్' సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పోలీసు రక్షణ కల్పిస్తామనీ, ఇందుకు గాను థియేటర్ల యాజమాన్యాలు దగ్గర్లో ఉన్న పోలీసు స్టేషన్ లో తమకు రక్షణ కల్పించాలని లిఖిత పూర్వక విజ్ఞప్తి సమర్పించాలనీ డిజిపి ఈ సందర్భంగా సూచించారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|