'చిత్ర పరిశ్రమ అందరిదీ'
చిత్ర పరిశ్రమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదనీ, కేవలం వినోదం అందించడమే చిత్ర పరిశ్రమ ధ్యేయమనీ, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదనీ పలువురు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు హైద్రాబాద్ లోని ఫిలించాంబర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఉద్యమాలకు సంబంధించి ఎవరో నలుగురు కళాకారులు మట్లాడితే అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది తప్ప పరిశ్రమకు వాటితో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 'మేం ప్రజలకు కావాలి. మాకు ప్రజలు కావాలి' అని విస్పష్టంగా ప్రకటించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ 'పరిశ్రమ ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్లో ఉంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, జెఎసి సోదరులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అందరూ కావాలి. మేము అందరికీ కావాలి. భవిష్యత్తులో రాజకీయంగా ఏం జరిగినా మేము ఆహ్వానిస్తాం. పరిశ్రమ ఓ కొద్ది మందికో చెందినది కాదు. ఒక వ్యవస్థ లాంటిది. వ్యవస్థ స్తంభిస్తే ఎందరో రోడ్డున పడతారు. పరిశ్రమకు సంక్రాంతి పెద్ద సీజన్. పలువురు నిర్మాతలు మంగళసూత్రాలను కూడా తాకట్టు పెట్టి సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు విడుదల కాకుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి' అని అన్నారు. తెలుగువారికి ఎప్పుడు ఏమి జరిగినా చిత్ర పరిశ్రమ ముందుకు వచ్చి ఆదుకుంటోందనీ, ఎవరో సంబంధం లేని వ్యక్తులు మాట్లాడితే మమ్మల్ని నిలదీయడం సమంజసం కాదనీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. పరిశ్రమ ఎక్కడికీ పోదనీ, మీకు మేము..మాకు మీరు ఉండాలనీ ఆయన అన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతికి పలు సినిమాలు విడుదలవుతున్నాయనీ, వినోదం అందించడమే సినిమా థ్యేయమనీ, ఇతర విషయాలతో తమకు సంబంధంలేదనీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా షూటింగ్ లు తగ్గిపోయి, సినిమాలు విడుదల చేయడానికి చాలామంది భయపడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమాలకు సినిమాలు అడ్డుకాదనీ, ఉద్యమకారులకు కళాకారులు శత్రువులు కాదనీ అన్నారు. ఈ సమావేశంలో కె.సి.శేఖర్ బాబు, విజయేంద్రరెడ్డి, సుధాకర్ రెడ్డి, దిల్ రాజు, డి.సురేష్ బాబు, జెమినీ కిరణ్, దానయ్య, నల్లమలుపు బుజ్జి, ఛత్రపతి ప్రసాద్,. కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, కాదంబరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|