ఇంతవరకూ ఇద్దరు కొత్తమ్మాయిలతో స్క్రీన్ రొమాన్స్ చేసిన హీరో నాగచైతన్య ఈసారి మాత్రం హాట్ బ్యూటీ కాజల్ తో జత కడుతున్నారు. తొలి చిత్రం 'జోష్'లో నాగచైతన్యకు జోడిగా కార్తిక (సీనయర్ నటి రాధిక కుమార్తె) నటించింది. ప్రస్తుతం నాగచైతన్య రెండో చిత్రాన్ని గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మంజుల నిర్మిస్తున్నారు. నాగచైతన్యకు జోడిగా సమంత (తొలి పరిచయం) ఇందులో నటిస్తోంది. షూటింగ్ చివర దశలో ఉన్నఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత నాగచైతన్య నటించబోయే మూడో చిత్రానికి కూడా రంగం సిద్ధమైంది. ఇందులో నాగచైతన్యకు జోడిగా కాజల్ ఎంపికైంది. దీనిని కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మించనున్నారు.
శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం నాగార్జున కథానాయకుడుగా 'కేడీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో తదుపరి చిత్రాన్ని నాగచైతన్యతో ఆయన అనౌన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన అద్భుతమైన స్క్రిప్టు కూడా రెడీ అయింది. దీనికి అజయ్ భూయాన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం కాజల్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మార్చిలో ఈ సెట్స్ మీదకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.