ఎన్టీఆర్ కథానాయకుడుగా బోగి పండుగకు విడుదలైన 'అదుర్స్' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో దర్శకుడు వి.వి.వినాయక్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు ప్రారంభించారు. స్టార్ హీరోలతో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించడంలో దిట్ట అయిన వినాయక్ ఈసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కొత్త చిత్రాన్ని చేయబోతుండటం విశేషం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. పవన్ ను దృష్టిలో పెట్టుకుని వినాయక్ అద్భుతమైన స్క్రిప్టు రెడీ చేశారనీ, ఇటీవలే స్టోరీలైన్ పవన్ కు వినిపించడంతో ఆయన మరో ఆలోచనకు తావులేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ మీదకు వచ్చే అవకాశాలున్నాయి.
పవన్ ప్రస్తుతం ఎస్.జె.సూర్య దర్శకత్వంలో సింగనమల రమేష్ నిర్మిస్తున్న 'పులి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. బ్యాలెన్స్ వర్క్ త్వరలోనే పూర్తి చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు హిందీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న '3 ఇడియట్స్' చిత్రం తెలుగు రీమేక్ లో అమీర్ ఖాన్ పాత్రకు పవన్ ను ఒప్పించేందుకు జెమినీ ఫిలిమ్ సర్క్యూట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ ఇంకా తన సమ్మతిని తెలియజేయ వలసి ఉంది.