రఘపతి వెంకయ్య విగ్రహం
తెలుగు చలన చిత్ర పితామహుడు స్వర్గీయ రఘుపతి వెంకయ్య పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా లైవ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేస్తోంది. ఇప్పుడు ఆయన గౌరవార్ధం హైద్రాబాద్ లోని ఫిలింనగర్ లో రఘపతి వెంకయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆదివారంనాడు ఈ విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి కె.రోశయ్య చేతుల మీదుగా జరుగనుంది. ఉదయం 11 గంటలకు జరిగే ఆ కార్యక్రమంలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారు.
రఘపతి వెంకయ్య పేరుతో ఒక ఫిల్మ్ అకాడమీ ఏర్పాటు చేయాలని, ఆయన పేరిట వివిధ కేటగిరిలలో ప్రముఖులైన వారికి జీవిత సాఫల్య పురస్కారాలను అందించాలనీ ఫిల్మ్ చాంబర్ కృతనిశ్చయంతో ఉంది. రఘపతి వెంకయ్య తన 18వ ఏట చెన్నైలో ఫోటోగ్రఫీ నేర్చుకుని అక్కడే ఓ ఫోటో స్టూడియో నెలకొల్పారు. 1909లో జాన్ డికెన్సన్ అండ్ కంపెనీ నుంచి క్రోనో మెగా ఫోన్ ను 30,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఆ కెమెరాతోనే సుమారు 12 లఘు చిత్రాలు తీసి వాటిని విక్టోరియా పబ్లిక్ హాలులో ప్రదర్శించేవారు. వీటి ప్రదర్శన కోసం బెంగుళూరు, విజయవాడ, శ్రీలంక, రంగూన్ లలోనూ విస్తృతంగా తిరిగేవారు. 1912లో చెన్నైలోని మౌంట్ రోడ్ లో 'గెయిటీ' టాకీస్ ను నిర్మించారు. చెన్నైలో సొంత థియేటర్ కలిగిన తొలి ఇండియన్ ఆయనే. ఆ తర్వాత చెన్నైలోనే 'క్రౌన్', 'గ్లోబ్' థియేటర్లను నిర్మించారు. అమెరికన్, బ్రిటిష్ చిత్రాలను కూడా ఇందులో ప్రదర్శించేవారు. 1919లో 'స్టార్ ఆఫ్ ఈస్ట్ ఫిలిమ్స్' అనే నిర్మాణ సంస్థను, 'గ్లాస్ స్టూడియో' అనే ఫిల్మ్ స్టూడియోను ప్రారంభించారు. లండన్ లో సినిమాటోగ్రఫీపై అధ్యయనం చేసేందుకు తన కుమారుడు రఘుపతి సూర్య ప్రకాష్ నాయుడును పంపారు. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి తొలిసారిగా 'మీనాక్షి కల్యాణం' అనే చిత్రాన్ని నిర్మించారు. అనంతరం 'గజేంద్ర మోక్షం', 'మత్స్యావతారం', 'నందనార్', 'భీష్మప్రతిజ్ఞ' వంటి చిత్రాలను నిర్మించారు. 'భీష్మ ప్రతిజ్ఞ' తొలి తెలుగు మూకీ కావడం విశేషం. 1929లో కొన్ని అప్పుల కారణంగా ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. ఆయన గౌరవార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును ప్రకటించింది. ఆ తర్వాత క్రమంలో ఆ అవార్డును రఘుపతి వెంకయ్య అవార్డుగా మార్చి తెలుగు సినిమాకు విశిష్ట సేవలందించిన వారికి లైఫ్ టైమ్ అచీమ్ మెంట్ గా ఈ అవార్డును ప్రదానం చేస్తోంది.
Be first to comment on this News / Article!
|