అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలతో స్ప్రింట్ కొడుతున్నారు. ఆయన నటించిన 'ఆర్య-2' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది ఆయన నటిస్తున్న కనీసం రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' చిత్రం మార్చి 26న విడుదల కానుంది. దీనికి తోడు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం 'వేదం' కూడా ఇదే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. ఈ రెండింటి తర్వాత అల్లు అర్జున్ 'బద్రీనాథ్' చిత్రానికి కమిట్ అయ్యారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని హన్సిక అందిపుచ్చుకున్నట్టు తెలిసింది.
అల్లు అర్జున్ సరసన 'దేశముదురు' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన హన్సిక ఆ చిత్రం సాధించిన సక్సెస్ తో బిజీ అయింది. ఇప్పుడు మరోసారి బన్నీతో నటించే అవకాశం రావడంతో వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. నిజానికి 'వేదం' చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా హన్సిక పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ పాత్ర నిడివి తక్కువ కావడంతో ఆ ఆఫర్ ను హన్సిక సున్నింతగా తోసిపుచ్చింది.
'బద్రీనాథ్' విషయంలోనూ తొలుత హీరోయిన్ గా ఇలియానాను అనుకున్నప్పటికీ డేట్ల సమస్య తలెత్తడంతో నిర్మాతలు హన్సికను అప్రోచ్ అయ్యారు. మార్చి లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, హన్సిక నటించిన తాజా చిత్రం 'సీతారాముల కళ్యాణం' ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.