చిత్ర పరిశ్రమ కృతజ్ఞత
సినిమాలను అడ్డుకోవద్దంటూ తాము చేసిన విజ్ఞప్తిని మన్నించిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, జె.ఎ.సి.కి తెలుగు చలన చిత్ర పరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది. హైద్రాబాద్ లోని ఫిలిం చాంబర్ లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన వారు పాల్గొని తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
మూవీ ఆర్ట్సిస్ట్స్ అసోయేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్ తొలుత స్పందిస్తూ, రాష్ట్రంలో నెలకొన్ని రాజకీయ సంక్షోభంలో కొన్ని చిత్రాల షూటింగ్ లనూ, సినిమా విడుదలను అడ్డుకోవడం జరిగిందనీ, అయితే వాటిని ఏమాత్రం అడ్డుకోవద్దని పరిశ్రమ చేసిన విజ్ఞప్తిని రాజకీయ పక్షాలు, ప్రజలు మన్నించి సినిమాలు యధావిధిగా ఆడేందుకు సహకరించడం ఆనందంగా ఉందనీ అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదనీ, మాకు అందరూ కావాలి...మేము అందరికీ కావాలి...అనే స్లోగన్ తోనే తాము ముందుకు వెళ్తున్నామనీ చెప్పారు. మునముందు రాజకీయంగా ఎలాంటి మార్పులు వచ్చినా పరిశ్రమ స్వాగతిస్తుందని స్పష్టం చేశారు.వ్యక్తిగత అభిప్రాయాలకూ, చిత్ర పరిశ్రమకూ ఎలాంటి సంబంధం లేదంటూ తాము చేసిన విజ్ఞప్తిని మన్నించి పరిశ్రమ సజావుగా ముందుకు సాగేందుకు దోహదం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. సుహృద్భావ వాతావరణంలో పరిశ్రమ ముందడుగు వేయాలని తామంతా కోరుకుంటున్నామని ఫిలిం చాంబర్ తరఫున కె.సి.శేఖర్ బాబు పేర్కొన్నారు. పరిశ్రమ చేసిన విన్నపానికి అందరూ స్పందించడం సంతోషంగా ఉందని నిర్మాతల మండలికి చెందిన ప్రసన్నకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు, నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ, డివివి దానయ్య, నట్టికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|