యువతరం 'ధూల్'
కొత్త హీరోహీరోయిన్లతో ఫైట్ మాస్టర్ విక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'ధూల్'. సుధన్, మను హీరోలు కాగా, పాయల్ శెట్టి హీరోయిన్. జై మారుతి ఫిలింస్ పతాకంపై కె.ఆర్.శ్రీనివాస్ అయ్యంగార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారంతో పూర్తయింది. హైద్రాబాద్ బంజారాహిల్స్ లోని రాక్ క్యాజిల్ లో చివరి రోజు షూటింగ్ సందర్భంగా దర్శకుడు విక్కీ తమ యూనిట్ సభ్యులతో కలిసి చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఫైట్ మాస్టర్ దర్శకత్వం వహిస్తున్నారనగానే ఫైట్స్ ఎక్కువగా ఉంటాయని అంతా అనుకుంటారనీ, అయితే తాను పూర్తిగా డైరెక్షన్ మీదే దృష్టి ఉంచి, ఫైట్స్ ను వేరే మాస్టర్ల చేత కంపోజ్ చేయించాననీ విక్కీ తెలిపారు. ఇంతవరకూ 50 రోజుల పాటు షూటింగ్ జరిపామనీ, హీరోహీరోయిన్లు కొత్తవారే అయినప్పటికీ మిగిలిన పాత్రల్లో సుమారు 30 మంది సీనియర్ ఆర్టిస్టులు ఇందులో నటించారనీ చెప్పారు. వినోదం కలగలిసిన ప్రేమకథతో రూపొందిన చిత్రమిదని తెలిపారు. త్వరలో ఆడియో, ఫిబ్రవరిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రంలో తాను పోలీసు అధికారిగా నటిస్తున్నట్టు ఎం.ఎస్.నారాయణ తెలిపారు. ఇందులో తనకు గుబురు మీసాలు ఉంటాయనీ, ధైర్యం మాత్రం ఉండదనీ, తన అసిస్టెంట్ గా గుండు హనుమంతరావు నటిస్తున్నారనీ తెలిపారు. ఎం.ఎస్.నారాయణతో తాను చేసిన కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు చక్కటి వినోదం అందిస్తుందని గుండు హనుమంతరావు తెలిపారు. తెలుగులో తనకు ఇది తొలి చిత్రమని పాయల్ శెట్టి పేర్కొంది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని మరో హీరో మను చెప్పగా, కామెడీగా ఉండే ఖైదీ వేషం తాను వేసినట్టు తిరుపతి ప్రసాద్ తెలిపారు. ఎం.ఎస్.నారాయణ సరసన మంచి పాత్ర చేసినట్టు గీతాసింగ్ పేర్కొంది. ఈ చిత్రంలోని పాటలు అలరిస్తాయని సంగీత దర్శకుడు ఖుద్దూస్, విలన్ పాత్ర పోషిస్తున్నానని మధు చెప్పారు. సమావేశంలో సహనిర్మాతలు టి.వి.రావు, వై.వి.రావు కూడా పాల్గొన్నారు. కథ-మాటలు-స్క్రీన్ పే సైతం విక్కీ అందించిన ఈ చిత్రానికి జగదీష్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|