నమో వెంకటేశ విజయోత్సవం
వెంకటేష్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన 'నమో వెంకటేశ'చిత్రం సంక్రాంతికి విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్ర విజయోత్సవాన్ని హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో చిత్రయూనిట్ మంగళవారం రాత్రి నిర్వహించింది. వెంకటేష్, బ్రహ్మానందం, శ్రీనువైట్ల, సురేష్ బాబు, గోపీ మోహన్, చింతపల్లి రమణ, కాశీ విశ్వనాథ్, రామజోగయ్య శాస్త్రి, ఢిల్లీ రాజేశ్వరి, శ్రీనివాసరెడ్డి, సుబ్బరాజు, శివారెడ్డి, మాస్టర్ భరత్, అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.
వెంకటేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినిమా ట్యాగ్ లైన్ తరహాలోనే తాను ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తుంటానీ, ఆడియెన్స్ కూడా ఈ చిత్రాన్ని అంతే పాజిటివ్ గా తీసుకుని పెద్ద సక్సెస్ చేశారనీ అన్నారు. సమష్టి కృషికి దక్కిన విజయంగా దీనిని అభివర్ణించారు. వెంకటేష్ లో మంచి కమెడియన్ ఉన్నాడనీ, ఈ చిత్రంలో తనకూ, వెంకటేష్ కూ మధ్య మంచి కెమెస్ట్రీ కుదిరిందనీ బ్రహ్మానందం పేర్కొన్నారు. ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇద్దరూ నటించామని చెప్పారు. అలాగే దర్శకుడు శ్రీనువైట్ల కూడా ఈ చిత్రంలోని ప్రతి క్యారెక్టర్ ను ఎంతో అవగాహనతో తీర్చిదిద్దారని ప్రశంసించారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ, 2008లో గోపీమోహన్ ఈ కథను తనకు వినిపించాడనీ, అప్పట్నించీ ఏడాదిగా తనతోటే ప్రయాణం చేశారనీ అన్నారు. తన మిత్రులైన నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా తొలి హిట్ రావడం, తనకు ఎంతో ఇష్టమైన వెంకటేష్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో మరోసారి వెంకటేష్ తో పనిచేయాలని ఉందని పేర్కొన్నారు. నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర మాట్లాడుతూ, శ్రీను వైట్ల తనకు మంచి మిత్రుడనీ, మిత్రుల కోసం ఎప్పుడు సినిమా చేస్తావని అడిగినప్పడు టైమ్ రావాలని అనేవారనీ, అది ఇప్పుడు రావడం, సినిమా మంచి సక్సెస్ కావడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే సకాలంలో ప్రింట్లు ల్యాబ్ నుంచి వచ్చేందుకు సురేష్ బాబు ఎంతో సహకరించారని అన్నారు. ఆలీ, శ్రీనివాసరెడ్డి, రామజోగయ్య శాస్త్రి, కోట శ్రీనివాసరావు తదితరులు ఈ చిత్ర విజయం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఝాన్సీ యాంకర్ గా వ్యవహరించారు.
Be first to comment on this News / Article!
|