చిలుకూరు బాలాజీ మహాత్మ్యం
భక్తుల పాలిటి కొంగుబంగారంగా, వీసా దేవుడుగా చిలుకూరు బాలాజీ నిత్యం వేలాది మంది నీరాజనాలు అందుకుంటున్నారు. ఇప్పుడు చిలుకూరు దేవాలయ స్థల పురాణం, భక్తుల జీవితాలలో బాలాజీ ప్రదర్శించిన మహిమల ఆధారంగా 'శ్రీ చిలుకూరు బాలాజీ మహాత్మ్యం' అనే ఓ చిత్రాన్ని సాయిప్రజ్ఞ మూవీ మేకర్స్ సమర్పణలో రాఘవేంద్ర రాయరు ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఉదయ్ దర్శకత్వంలో జి.వై.గిరి, వర్కల రాజుగౌడ్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది.
చిత్ర విశేషాలను తొలిసారిగా నిర్మాతలు తెలియజేస్తూ, ఈ చిత్రంలో 65 మంది నటీనటులు ఉంటారనీ, వీరిలో 25 మంది ప్రముఖ తారాగణంతో పాటు పదిమంది టీవీ, రంగస్థల నటులు, పలువురు కొత్తవారు ఉంటారని చెప్పారు. చిలుకూరు బాలాజీ దేవాలయ స్థల పురాణం, మహిమలను ఈ చిత్రంలో చూపించనున్నట్టు దర్శకుడు ఉదయ్ తెలిపారు. చిలుకూరు గ్రామ పెద్దలు విలువైన సమాచారం తమకు అందించారని అన్నారు. చిలుకూరులోనే షూటింగ్ జరుపుతామని, బాలాజీగా ఓ ప్రముఖ హీరో నటించనున్నారనీ తెలిపారు. సాయిశ్రీ హర్ష, గురుచరణ్ తో పాటు పలువురు సీనియర్ గేయరచయితలు పాటలు రాస్తున్నారనీ, ఉన్నత శ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తారనీ చెప్పారు. కొద్దిపాటి గ్రాఫిక్ వర్క్ కూడా ఉంటుందని వివరించారు.
Be first to comment on this News / Article!
|