'డాక్టర్ ఇందిర'గా రజని
సీనియర్ నటి రజని గుర్తుంది కదూ. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్., రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖ హీరోలందరితోనూ అప్పట్లో పలు హిట్ చిత్రాల్లో రజని నటించింది. 'మజ్ఞు', 'సీతారామ కళ్యాణం', 'రాము', 'అగ్నిపుత్రుడు', 'కలెక్టర్ గారి అబ్బాయి', 'అహ నా పెళ్లంట', 'రెండు రెళ్లు ఆరు' వంటి చిత్రాలు ఆమెకు మంచిపేరు తెచ్చాయి. కొద్దికాలం క్రితం ఓ ఎన్ఆర్ఐ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు. చాలాకాలం తర్వాత ఆమె బుల్లితెర ద్వారా రీఎంట్రీ చేసింది. పలు డైలీ, వీక్లీ సీరియల్స్ అందించిన ఫిల్మీడియో క్రియేషన్ నిర్మిస్తున్న 'డాక్టర్ ఇందిర' ధారావాహికలో ఆమె టైటిల్ రోల్ పోషిస్తోంది. దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ లో ప్రతి ఆది, సోమవారాల్లో ప్రసారమయ్యే ఈ సీరియల్ లో రజనీ, వైభవ్, ద్వారకేష్, చిన్నికృష్ణ, రోజా ప్రధాన పాత్రదారులు. ఈ సీరియల్ కు 104 వంటి ఆరోగ్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెచ్.ఎం.ఆర్.ఐ. వైద్య ఆరోగ్య సలహాలనిస్తూ పర్యవేక్షిస్తోంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రజారోగ్యమే పరమావధిగా ఈ సీరియల్ నిర్మిస్తుండటం అభినందనీయమని రజని ఆ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజానీకానికి సేవచేసే ఇందిర పాత్ర ఎంతో ఉదాత్తమైనదనీ, అందుకే చాలాకాలంగా సినీ రంగానికి దూరంగా ఉన్న తాను తిరిగి ఇందులో నటించాననీ తెలిపారు. తనకెంతో సంతృప్తినిచ్చిన ఈ పాత్ర తప్పుకుండా బుల్లితెర వీక్షకుల ఆదరణ కూడా చూరగొంటుందనే నమ్మకం ఉందని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు ఎలాంటి చికిత్స పొందాలనే విషయాలను ఇందులో వివరిస్తున్నామని పి.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యపరంగా చైతన్యం తెచ్చే ఇలాంటి సీరియల్ కు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సీరియల్ కు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు కాన్సెప్ట్ అందించగా, రాజేషన్ నందన్ ఛాయాగ్రహణం, మల్లిక్ శర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|