అల్లు అరవింద్ 'కలేజా'
పెర్ ఫెక్ట్ ప్లానింగ్ తెలిసిన నిర్మాతలు ఎవరైనా సరే అనవసరంగా ఒక్క రూపాయి కూడా బయటకు తీయరు. అవసరమొస్తే కోట్లు కుమ్మరించడానికీ వెనుకాడరు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇందుకు నికార్సయిన ఊదాహరణ. 'జల్సా'తో సూపర్ హిట్ కొట్టి, హిందీ 'గజనీ'తో సరికొత్త కలెక్షన్ రికార్డులు సృష్టించి, 'మగధీర'తో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన క్రెడిట్ ఆయనది. సహజంగా తన కుటుంబ సభ్యుల సినిమాలు మినహా బయట చిత్రాలను పంపిణీ చేయడానికి ఆయన పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పుడు అల్లు అరవింద్ బయట సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలోనూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటం విశేషం. ఇందులో భాగంగానే మహేష్ బాబు కథానాయకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సింగనమల రమేష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న కొత్త చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను (నైజాం, ఆంధ్రా ఏరియాలు) అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. ఇందు కోసం ఆయన భారీ మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'కలేజా' అనే టైటిల్ సైతం పరిశీలనలో ఉంది.
అల్లు అరవింద్ 'కలేజా' చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకోవడం పట్ల నైజాం ఏరియాలోని పలువురు డిస్ట్రిబ్యూటర్లు దిగ్భ్రాంతి చెందున్నారు. సహజంగానే బయట నిర్మాతలకు సంబంధించిన సినిమాల విషయంలో అన్ని విధాలా సంతృప్తి చెందితేనే అరవింద్ జేబులోంచి డబ్బులు తీస్తారనీ, అందులోనూ తెలంగాణ రీజియన్ లో అల్లు అర్జున్ 'ఆర్య-2' చిత్రానికి ఎదురైన చేదు అనుభవం తర్వాత కూడా ఆయన నైజాం రైట్స్ సొంతం చేసుకోవడం సాహసమే కావచ్చనీ వారు అభిప్రాయపడుతున్నారు. అల్లు అరవింద్ బిజినెస్ స్ట్రాటజీని తెలిసిన వారు మాత్రం...మహేష్ సినిమా కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఈ చిత్రానికి కనకవర్షం కురిపించడం ఖాయమనే విషయాన్ని అల్లు అరవింద్ ముందుగానే పసిగట్టారని అంటున్నారు. మొత్తానికి 'కలేజా' అనేది టైటిల్ లోనే కాకుండా తనకూ ఎక్కువేనని అల్లు ప్రూవ్ చేసుకుంటున్నారు.
Be first to comment on this News / Article!
|