సిద్దార్ధ 'బావ' షురూ
సిద్దార్ధ కథానాయకుడుగా శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం 'బావ'. రాంబాబు దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. సిద్దార్ధపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ ఇవ్వగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు. కోడి రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు రాంబాబు మట్లాడుతూ, ఇది బావామరదళ్ల మధ్య జరిగే ప్రేమకథా ఇతివృత్తమనీ, హీరో తండ్రిగా ఒక ప్రముఖ హీరో నటించనున్నారనీ తెలిపారు. దర్శకుడుగా తనకు ఈ అవకాశం ఇచ్చిన సిద్దార్ధ, నిర్మాత చౌదరికి తన కృతజ్ఞతలని అన్నారు. సంగీత దర్శకుడు చక్రి మాట్లాడుతూ, సిద్దార్ధతో తనకు ఇది రెండవ చిత్రమనీ, ఎంఎల్ కుమార్ చౌదరితో ఐదవ సినిమా అనీ అన్నారు. సిద్దార్ధ మాట్లాడుతూ, తన కెరీర్ లో 2010 మరిచిపోలేని సంవత్సరమని అన్నారు. సోలో హీరోగా తాను నటించిన హిందీ చిత్రం 'స్టైకర్' ఈ ఏడాది విడుదలవుతోందనీ, అలాగే కె.రాఘవేంద్రరావు బ్యానర్ లో నటిస్తున్నాననీ చెప్పారు. ఈ చిత్ర దర్శకుడు రాంబాబు గత నాలుగేళ్లుగా తనకు బాగా తెలుసనీ, అతను చాలా మంచి స్క్రిప్టుతో వచ్చారని చెప్పారు. కొత్త డైరెక్టర్ల వద్ద చాలా స్టామినా ఉంటుందనీ, అందుకే వారితో పనిచేసేందుకు తాను ఎప్పుడూ ఇష్టపడుతుంటాననీ అన్నారు. ఎంఎల్ కుమార్ చౌదరితో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే చుక్కల్లో చంద్రుడు చిత్రంతో చక్రి తనను గాయకుడుగా కూడా పరిచయం చేశారని గుర్తు చేశారు. ఎంఎల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, రెండేళ్ల గ్యాప్ తర్వాత తాను చేస్తున్న చిత్రమిదనీ, చక్కటి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామనీ చెప్పారు. చిత్ర ప్రారంభోత్సవంలో గణేష్ బాబు, రజిత, దిల్ రాజు, కెఎల్ నారాయణ, చింతపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, ఆహుతి ప్రసాద్, రఘబాబు, నాజర్, రజిత, సురేఖా వాణి, మాస్టర్ భరత్ తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, అరవింద్ కృష్ణ ఫోటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|