'మగధీర' 175 రోజులు
డెభ్బై ఐదేళ్లకు పైబడిన తెలుగు సినీ చరిత్ర రికార్డులను తిరగరాసిన 'మగధీర' చిత్రం మరో మైలురాయి సాధించింది. ఈ శుక్రవారంతో విజయవంతంగా 3 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ హిట్ గా నిలిచింది. 2009 జూలై 31న భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం 50 రోజులు, 100 రోజుల పరంగా సరికొత్త రికార్డులు సాధించింది. 302 కేంద్రాల్లో 50 రోజులు, 225 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల 'మగధీర'పై నిషేధం వేటు పడటంతో తెలంగాణలోని థియేటర్ల నుంచి సినిమా తీసేశారు. ఈ నేపథ్యంలో ఆదోని (సీడెడ్), గోపాల పట్నం (విశాఖపట్నం), పి.వి.ఆర్.సినిమాస్ (బెంగుళూరు)లో ఈ చిత్రం 175 రోజులు పూర్తి చేసుకుంది.
రామ్ చరణ్, కాజల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. తెలుగు సినీ చరిత్రలోనే తొలి భారీ బడ్జెట్ చిత్రంగా 45 కోట్లతో రూపొంది...100 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిన రికార్డును దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో 'మావీరన్' పేరుతో అనువదించి విడుదలకు సిద్ధం చేస్తుండగా, బాలీవుడ్ లో రీమేక్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే ఈ చిత్ర శతదినోత్సవాన్ని హైద్రాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేసినప్పటికీ రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామల వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
Read 2 Comment(s) posted so far on this News / Article!
|