ఒక నిబద్ధతతో తాము తీసిన '1940లో ఒక గ్రామం' చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు రావడం చాలా సంతోషం కలిగించిందని ఆ చిత్ర దర్శకుడు నరసింహ నంది తెలిపారు. ఈ అవార్డు మరిన్ని మంచి చిత్రాలు తీయాలనే స్ఫూర్తిని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. 2008 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులను శనివారంనాడు కేంద్రం ప్రకటించింది. ఇదే చిత్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం (2008) అవార్డును ప్రకటించింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ నరసింహా పతాకంపై నందిరెడ్డి నరసింహారెడ్డి, జువ్విసెట్టి శ్రీరావమ్మ నిర్మించారు. పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవంతో నరిసింహ నంది తొలిసారిగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
రాష్ట్ర అవార్డుతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డు కూడా రావడం పట్ల నరసింహ నంది స్పందిస్తూ '1940 నాటి సామాజిక పరిస్థితులకు అద్దంపట్టే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాతలు ఎంతో కమిట్ మెంట్ తో తీసిన చిత్రమిది. దర్శకుడిగా నాకిది తొలిచిత్రం. ఒక మంచి ఆశయంతో తీసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడం ఎనలేని ఆనందాన్నిచ్చింది. ఈ అవార్డు స్ఫూర్తితో మునుముందు మరిన్ని మంచి సినిమాలు తీస్తాను' అని చెప్పారు. ప్రస్తుతం 'హైస్కూలు' అనే చిత్రానికి నరసింహ నంది దర్శకత్వం వహిస్తున్నారు.