మిల్క్ బ్యూటీ తమన్నాకు తెలుగులో మరో సువర్ణావకాశం దక్కింది. స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ తదుపరి చిత్రంలో ఆయనకు జోడిగా ఎంపికైంది. తొలుత 'శ్రీ' చిత్రంలో తెలుగులోకి అడుగుపెట్టిన తమన్నాకు శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్'తో సరైన బ్రేక్ వచ్చింది. ఇదే సమయంలో తమిళంలో 'కల్లూరి' వంటి సక్సెస్ ఫిల్మ్ ఆమెను వరించింది. అనూహ్యంగా తెలుగులో కంటే తమిళంలోనే ఆమె ప్రస్తుతం డిమాండ్ లో ఉంది. తెలుగులో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' తర్వాత ఏ కొత్త చిత్రం ఒప్పుకోని తమన్నా తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మాతగా రూపొందనున్న 'బద్రీనాథ్' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.
'బన్నీ' తర్వాత అల్లు అర్జున్, వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. అల్లు అర్జున్ తో తమన్నా నటించనుండటం ఇదే ప్రథమం. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సిక పేరు పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఆమె ఎక్కువ పారితోషికం ఆశించడంతో ఫిల్మ్ మేకర్స్ తమన్నాను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మార్చిలో ఈ చిత్రం సెట్స్ పైకి రాబోతోంది.