'ఈ హిట్ కోసమే రెండేళ్లాగా'
సరైన హిట్ కొట్టి అభిమానుల కేరింతలు వినే రోజు కోసం రెండేళ్లు ఆగాననీ, ఆ కోరిక నెరవేర్చి మంచి హిట్ ఇచ్చిన ప్రేక్షకాభిమానుల రుణం తీర్చుకోలేననీ ఎన్టీఆర్ ఉద్వేగంగా అన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన 'అదుర్స్' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తరుణంలో ఆ చిత్ర సంగీతానికి ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ప్రదానోత్సవం హైద్రాబాద్ లోని ఓడియన్ థియేటర్ లో ప్రేక్షకుల సమక్షంలో ఆదివారంనాడు జరిగింది. వినాయక్, నిర్మాతలు వల్లభనేని వంశీ, కొడాలి శ్రీవేంకటేశ్వరరావు, చోటా కె.నాయుడు, నల్లమలుపు బుజ్జి, రామజోగయ్య శాస్త్రి, శివ, థియేటర్ మేనేజర్ కిరణ్, ఆదిత్య దయానంద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ, అర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూడటమంటే భలే సరదాగా ఉండేదనీ, బాలయ్య బాబాయ్ సినిమాలన్నీ ఇక్కడే చూసి తాను ఎంజాయ్ చేసే వాడిననీ చెప్పారు. ఇప్పుడు అభిమానుల కేరింతలు వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ఈరోజు అందరి ముందూ ఇలా నిలబడి మాట్లాడతానని అనుకోలేదని అన్నారు. తాతయ్య ఆశీస్సులు, ప్రేక్షకుల అభిమానం మళ్లీ తనను నిలబెట్టాయని అన్నారు. ఈ కేరింతలు వినడానికి రెండేళ్లు ఆగాననీ, విందుభోజనం లాంటి హిట్ ఇచ్చి ఆకలి తీర్చారనీ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి విజయాలు అందించడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమనీ అన్నారు. వినాయక్ తో ఇది తనకు హ్యాట్రిక్ ఫిల్మ్ అనీ, ఇలాంటి హ్యాట్రిక్ లు పది కొట్టాలనుందనీ పేర్కొన్నారు. ఇంత మంచి విజయం అదించిన అభిమానులకు తాము రుణపడి ఉంటామని వినాయక్, చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ల ప్రదానం జరిగింది. చిత్ర యూనిట్ అంతా కలిసి ఎన్టీఆర్ కు డిస్క్ ప్రదానం చేశారు.
Be first to comment on this News / Article!
|