నాగార్జున 'వాంటెడ్'
విలక్షణ ఇతివృత్తాలతో సినిమాలు చేయడానికి ఇష్టపడే నాగార్జున 'కేడి' తర్వాత రాధామోహన్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించనున్న చిత్రానికి కమిట్ అయ్యారు. రాధామోహన్ ఇటీవలే 'ఆకాశమంత' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ఆ చిత్రంలో భిన్నమైన భావోద్వాగాలను దర్శకుడు తెరకెక్కించిన వైనం నాగార్జునను ఎంతో ఇంప్రెస్ చేయడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి 'పయనం' అనే టైటిల్ కొద్దికాలంగా ప్రచారంలో ఉండగా, ప్రస్తుతం 'వాంటెడ్' అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తుండటం విశేషం. తెలుగు వెర్షన్ ను దిల్ రాజు, తమిళ వెర్షన్ ను ప్రకాష్ రాజ్ నిర్మించనున్నారు.
'ఆకాశమంత' సమయంలో ప్రకాష్ రాజ్ తమిళంలో, దిల్ రాజు తెలుగులో నిర్మాతలకు వ్యవహరించడం, సహజంగానే దిల్ రాజు సినిమాల్లో ప్రకాష్ రాజ్ తప్పనిసరి కావడం వంటి కారణాల వల్ల ఆ ఇద్దరి మధ్యా మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. 'వాంటెడ్' లో నాగార్జున చేసే పాత్రను తమిళంలో ప్రకాష్ రాజ్ పోషించబోతున్నారు. గతంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ ను తాలిబాన్లు హైజాక్ చేసిన ఉదంతానికి దగ్గరగా ఈ కథ ఉండబోతోందనీ, ఇందుకోసం ఓ విమానాశ్రయం సెట్ కూడా వేస్తున్నారనీ తెలుస్తోంది. నాగార్జున 'కేడీ' చిత్రం రిలీజ్ తర్వాత ఈ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. మరోవైపు దిల్ రాజు నిర్మాణంలో ఎన్టీఆర్ 'బృందావనం', వరుణ్ సందేశ్ 'మరోచరిత్ర' చురుగ్గా షూటింగ్ జరుపుకొంటున్నాయి.
Be first to comment on this News / Article!
|