అనుష్క 'పంచాక్షరి' లోగో
అనుష్క కథానాయికగా సాయిరత్న క్రియేషన్స్ పతాకంపై బొమ్మదేవర రామ చంద్రరావు అలియాస్ నిర్మిస్తున్న చిత్రం 'పంచాక్షరి'. అక్కినేని నాగార్జున సమర్పకుడు. వి.సముద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్ర విశేషాలను యూనిట్ తెలియజేసింది. అనుష్క, నాజర్, చంద్రమోహన్, రవిప్రకాష్, నిర్మాత చంద్ర, సంభాషణల రచయిత తోట ప్రసాద్, డాన్స్ మాస్టర్ శివశంకర్, కథారచయిత మధు విప్పర్తి, కెమెరామన్ వాసు తదితరులు పాల్లొన్నారు.
దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోస్ లో 35 ఏళ్లుగా మేకప్ మన్ గా చంద్ర పనిచేస్తున్నారనీ, అప్పట్లో తాను 'శివరామరాజు' చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన తనను కలిసి తాను నిర్మించే తొలి చిత్రానికి దర్శకత్వం వహించమని అడగారనీ, తాను వెంటనే అంగీకరించానని అన్నారు. అలా 'పంచాక్షరి' చిత్రం తమ కాంబినేషన్ లో మొదలైందని అన్నారు. వృత్తిరీత్యా చంద్ర మేకప్ మన్ అయినప్పటికీ అన్ని విభాగాల మీద మంచి పట్టు ఉందని పేర్కొన్నారు. టైటిల్ కు తగిన కథ ఇదని రచయిత ఆకుల ప్రసాద్ తెలిపారు. గతంలో పలువురు మేకప్ మన్ లు నిర్మాతలుగా సక్సెస్ అయిన విధంగానే చంద్ర కూడా నిర్మాతగా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. మేకప్ మన్ గా ఎంతో కష్టపడే చంద్ర నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు నాజర్ పేర్కొన్నారు. అనుష్క మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోస్ తీసిన 'సూపర్' చిత్రంతో తాను నటిగా పరిచయమైనప్పుడు తన తొలి మేకప్ మన్ గా చంద్ర వ్యవహరించారనీ, అప్పుడే తనకు ఒక చిత్రం చేయమని అడగడం, తాను ఒప్పుకోవడం జరిగిందన్నారు. గత ఏడాది 'పంచాక్షరి' స్క్రిప్టు తో వచ్చినప్పుడు ఆ స్క్రిప్టు తనకెంతో నచ్చిందనీ అన్నారు. అదే స్క్రిప్టుతో తెలియని వ్యక్తి వచ్చి అడిగినా ఒప్పుకునేదానినని పేర్కొన్నారు. ఈ చిత్రానికి అరుంధతి సినిమాతో ఎలాంటి పోలికలు ఉండవనీ, దేనికదే ప్రత్యేకంగా ఉంటుందనీ చెప్పారు. 'మహానంది' చిత్రం తర్వాత సముద్ర దర్శకత్వంలో నటించడం తనకిది రెండోసారని ఆమె తెలిపారు. చంద్ర మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోస్ కు తాను రుణపడి ఉన్నానని అన్నారు. ప్రస్తుతం 'పంచాక్షరి' రెండో షెడ్యుల్ జరుగుతోందనీ, మార్చిలో పూర్తి చేసి ఏప్రిల్ కు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామనీ చెప్పారు.
Be first to comment on this News / Article!
|