జనం గుండె 'గుమ్మడి'
పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ ఆయన పోషించని పాత్ర లేదు. ఎస్వీ రంగారావుకు సమఉజ్జీగా నిలిచి ఆయన తోనే అభినందలు అందుకున్న విశిష్ట కళాకారుడు గుమ్మడి. 'కులదైవం', 'మా ఇంటి మహాలక్ష్మి', 'కులగోత్రాలు', 'జ్యోతి', 'రాజమకుటం', 'సతీ తులసి', 'భక్త పోతన', 'మిస్సమ్మ', 'రాణి రత్నప్రభ', 'నమ్మిన బంటు', 'జయభేరి', 'హరిశ్చంద్ర', 'దీపావళి' వంటి ఎన్నో చిత్రాలు ఆయనకు పేరు తెచ్చినవే. నటుడికి వాచకం ప్రధాన ఆర్హత అని నమ్మే గుమ్మడి 'ఆయనకు ఇద్దరు' చిత్రం సమయంలో వయోభారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినడంతో సరిగా మాట్లాడలేకపోయారు. దీంతో ఆయన పాత్రకు నూతన ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత గుమ్మడి నటించడం ఆపేశారు. ఆ తర్వాత తన వయసుకు తగ్గట్టుగా ఉంటుందని, స్వరానికి కూడా సరిపోతుందని చెప్పడంతో 'శ్రీ కాశినాయన చరిత్ర'లో చివరిసారిగా గుమ్మడి నటించారు. ఆ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది.
గుమ్మడికి 1989లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 'కళాప్రపూర్ణ'తో సత్కరించగా, రాష్ట్ర ప్రభుత్వం సమున్నతమైన 'రఘుపతి వెంకయ్య' అవార్డును అందజేసింది. గుమ్మడి తన జీవన స్మృతులను 'తీపి గుర్తులు...చేదు జ్ఞాపకాలు' పేరుతో అక్షరీకరించారు. రంగుల్లో రూపొందిన క్లాసిక్ 'మాయాబజార్' చిత్రాన్ని గుమ్మడి ఇటీవల ప్రత్యేకంగా తిలకించారు. ఈనెల 30న ఈ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలోనే ఆయన కన్నుమూయడం ప్రేక్షక లోకానికి తీవ్ర విషాధం మిగిల్చింది. ఆయన భౌతికంగా ఈరోజు మనముందు లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు సినీ ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతాయి.
Be first to comment on this News / Article!
Pages: -1- 2
|