గుమ్మడికి ప్రముఖుల నివాళి
సీనియర్ సినీ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు (83) తీవ్ర అస్వస్థతతో కేర్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి కన్నుమూయడంతో పరిశ్రమ శోఖ సంద్రమైంది. ఆయన భౌతికకాయాన్ని ఫిలింనగర్ లో ఉన్న స్వగృహానికి బుధవారంనాడు తరలించడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడకు చేరుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. గుమ్మడి స్వస్థలమైన గుంటూరు జిల్లా రావికంపాడులో గురువారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. గుమ్మడికి ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
ముఖ్యమంత్రి రోశయ్య కేర్ ఆసుపత్రికి వెళ్లి గుమ్మడి భౌతిక కాయానికి పూలమాల వేసి సంతాపాన్ని తెలియజేశారు. గుమ్మడి తన చిన్ననాటి స్నేహితుడని ఆయన గుర్తుచేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేరుగా గుమ్మడి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చలన చిత్ర పరిశ్రమ స్వర్ణయుగం నాటి ధ్రువతార గుమ్మడి అనీ, ఆయన లేని లోటు తీర్చలేనిదని అన్నారు. మానవతా విలువలున్న వ్యక్తి గుమ్మడి అనీ, తన జీవితమంతా సినీరంగంలోనే గడిపారనీ, తనకు మంచి స్నేహితుడినీ అక్కినేని నాగేశ్వరరావు తన సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటనలో ఉన్న చిరంజీవి అక్కడ్నించే గుమ్మడికి నివాళులర్పించారు. ఈ సమయంలో తాను హైదరాబాద్ లో లేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో గమ్మడి చిరస్థాయిగా నిలుస్తారని బిజెపి సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. గుమ్మడితో తనకు 42 ఏళ్ల అనుబంధం ఉందని డాక్టర్ దాసరి నారాయణరావు గుర్తు చేసుకున్నారు. తాము 48 సినిమాలకు కలిసి పనిచేశామనీ, తన తొలి సినిమా 'స్వర్గం-నరకం'లో గుమ్మడి నటించారనీ, అలాగే 'సర్దార్ పాపారాయుడు' చిత్రంలో మహాత్మాగాంధీ లాంటి పాత్రను గుమ్మడి పోషించారనీ గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నేరుగా గుమ్మడి నివాసంలో ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి భోరున విలపించారు. గుమ్మడి నివాసంలో ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో కేంద్ర మంత్రి పురంధేశ్వరి, ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.మురళీమోహన్, కృష్ణ, విజయనిర్మల, డాక్టర్ డి.రామానాయుడు, పరుచూరి సోదరులు, తమ్మారెడ్డి భరజ్వాజ, డి.సురేష్ బాబు, వి.సాగర్, జమున, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్, కవిత, బ్రహ్మానందం, నాగబాబు, రామ్ చరణ్ తేజ, మాడా, జయలలిత, శివపార్వతి, ఉత్తేజ్, ఆలీ, ఆర్.నారాయణమూర్తి తదితరులు ఉన్నారు.
Be first to comment on this News / Article!
|