'స్వర్ణయుగపు ధ్రువతార'
ఆరు దశాబ్దాల నటజీవితంలో 500కు పైగా చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన స్వర్ణయుగపు ధ్రువతార గుమ్మడి అనీ, ఆయన లేని లోటు తీర్చలేనిదనీ పలువరు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కేర్ ఆసుపత్రి నుంచి గమ్మడి భౌతికకాయాన్ని ఆయన నివాసానికి బుధవారం తరలించడంతో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు చివరిసారిగా ఆయనను సందర్శించి కన్నీళ్ల పర్వంతమయ్యారు.
మంచి స్నేహితుడ్ని కోల్పోయా
'మానవత్వ విలువలు తెలిసిన వ్యక్తి గుమ్మడి,. తన జీవితమంతా సినీరంగానికే అంకింతం చేశారు. నాకు దగ్గరగా ఉండే మంచి స్నేహితుడు. ముక్కసూటిగా మాట్లాడటం ఆయన నైజం. అందుకే ఆయనంటే నాకెంతో ఇష్టం. ఇలాంటి స్నేహితుడ్ని కోల్పోవడం ఎంతో బాధగా ఉంది' అని అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. గుమ్మడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మహాత్ముడుగా..
గుమ్మడితో తనకు 42 ఏళ్ల అనుబంధం ఉందనీ, 46 సినిమాలకు తామ పనిచేశామనీ దర్శకరత్న దాసరి నారాయణరావు గుర్తి చేసుకున్నారు. తన తొలి సినిమా 'స్వర్గం నరకం'లో గుమ్మడి నటించారనీ, 'సర్దార్ పాపారాయుడు'లో మహాత్మాగాంధీని తలపించే పాత్రను పోషించారనీ, తెలుగు సినిమాకు ఆయన లేని భర్తీ చేయలేమనీ ఘనంగా నివాళులర్పించారు.
ఎన్టీఆర్ తో ఎంతో సన్నిహితంగా..
ఎన్టీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉన్న మంచి మనిషి, స్వర్ణయుగపు ధ్రువతార గుమ్మడి అని, ఆయన లేని లోటు తీర్చలేమనీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అభివర్ణించారు.
కైకాల కంటతడి...
గుమ్మడి తన సమకాలికుడు మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన ఆత్మీయానుబంధం తమదని ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ గుర్తు చేసుకుంటూ గుమ్మడి భౌతికకాయం వద్ద భోరున విలపించడం అక్కడున్న వారందరి మనసులను ద్రవింపజేసింది. గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన సినీ ప్రముఖులలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.మురళీమోహన్, కృష్ణ, విజయనిర్మల, డాక్టర్ డి.రామానాయుడు, పరుచూరి సోదరులు, తమ్మారెడ్డి భరజ్వాజ, డి.సురేష్ బాబు, వి.సాగర్, జమున, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్, కవిత, బ్రహ్మానందం, నాగబాబు, రామ్ చరణ్ తేజ, మాడా, జయలలిత, శివపార్వతి, ఉత్తేజ్, ఆలీ, ఆర్.నారాయణమూర్తి తదితరులు ఉన్నారు.
Be first to comment on this News / Article!
|