విలక్షణ నటుడు కమల్ హాసన్ 'ఈనాడు' (ఉన్నై పోల్ ఒరువన్) తర్వాత కొత్త చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి తమిళంలో 'యావరుమ్ కేళీర్' (అందరూ వినండి) అనే టైటిల్ పెట్టారు. కమల్ తో గతంలో పలు హిట్ చిత్రాలు ఇచ్చి ఇటీవలే 'దశావతారం' వంటి సెన్సేషన్ ఫిల్మ్ ను అందించిన కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఉదయనిధి స్టాలిన్ నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటిస్తారనేది సస్పెన్స్ కు కూడా ఇప్పుడు తెరపడింది. కమల్ కు జోడిగా అందాల సుందరి త్రిష నటించనుంది.
కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మర్మయోగి' కోసం అప్పట్లో త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే ఆ చిత్రం ఒక్క అడుగుకూడా వేయకుండానే ఆగిపోయింది.ఈ చిత్రం కోసం 'సిలంబం' అనే పాపులర్ మార్షల్ ఆర్ట్స్ లో త్రిష శిక్షణ పొందడంతో పాటు, పురాతన తమిళ భాష నేర్చుకునేందుకు స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకుంది. ఆ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన డేట్లనే ఇప్పుడు కమల్ తన తాజా చిత్రం కోసం వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. దీనిపై త్రిషను సంప్రదించినప్పుడు 'కమల్ సినిమాలో నటించే అవకాశం రావడమంటే ఈ ప్రపంచంలో నా కంటే అదృష్టవంతురాలు ఎవరూ ఉండనట్టే. కమల్ నుంచి ఆ స్వీట్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నాను' అంటూ నవ్వుతూ చెప్పింది. ఈ చిత్రంలో ఉదయ నిధి స్టాలిన్ సైతం ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి దీపావళి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కమల్-త్రిషకు ఉన్న పాపులారిటీని బట్టి ఈ చిత్రం తమిళంతో పాటు ఏకకాలంగా తెలుగులోనూ విడుదలవుతుంది.