'బంపర్' చోరీ ఇది!
సాయిరాం శంకర్ కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ నిర్మించిన 'బంపర్ ఆఫర్' చిత్రం కథ తనదేననీ, తనకు తెలియకుండా తన కథతోనే సినిమా తీసి తీరని అన్యాయం చేశారనీ యువ రచయిత, దర్శకుడు ఆర్.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం జరుపుతానంటూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న సినీ రచయితల సంఘం ముందు బుధవారంనాడు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అనంతరం సినీ పెద్దల హామీతో దీక్ష విరమించారు.
దీక్ష సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో తాను నవదీప్ హీరోగా 'పొగరుబోతు', సచిన్ తో 'నిను చూడక నేనుండలేను' చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. వీటి తర్వాత తాను రాసుకున్న కథను ఓ తమిళ నిర్మాతను కలిసి సినిమా తీసేందుకు ఒప్పించాననీ, చిత్ర నిర్మాణానికి సన్నాహాలు కూడా జరిగాయనీ చెప్పారు. ఈ కథను తాను హైదరాబాద్ లోని రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయించానని తెలిపారు. ఆ తర్వాత క్రమంలో 'బంపర్ ఆఫర్' విడుదలైందని అన్నారు. తాను తన కథ గురించి మిత్రులకు చెప్పినప్పుడు ఇదే కథతో 'బంపర్ ఆఫర్' సినిమా వచ్చిన విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారనీ, ఆ సినిమా చూసి అందులోని 15 సన్నివేశాల వరకూ తన కథలోని వాటినే వాడుకోవడం తనను అవాక్కయ్యేలా చేసిందనీ తెలిపారు. ఇదే విషయాన్ని పూరీ జగన్నాథ్, ఆయన తమ్ముడు సాయిరాం శంకర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు చాలాసార్లు ప్రయత్నించినట్టు చెప్పారు. సాయిరాం శంకర్ పట్టించుకోలేదనీ, పూరీ జగన్నాథ్ ను కలిసినప్పటికీ ఆయన చాలా తేలికగా తీసుకున్నారనీ వాపోయారు. ఈ విషయం తెలిసిన తమిళ నిర్మాత ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ కోసం 4.5 లక్షలు, 1 లక్ష అడ్వాన్స్ గా చెల్లించానంటూ మొత్తం 5.5 లక్షలు కట్టమని తనపై ఒత్తిడి తెస్తున్నట్టు శ్రీనివాస్ చెప్పారు. ఈ తరుణంలో తనకు న్యాయం జరిగేంత వరకూ ఆమరణ దీక్ష చేయడం మినహా మరో మార్గం లేకపోయిందన్నారు. శ్రీనివాస్ దీక్ష గురించి సమాచారం అందడంతో పలువురు సినిమా ప్రముఖులు అతన్ని కలిసి ఈ విషయాన్ని ఫెడరేషన్ దృష్టికి తీసుకు వస్తానని నచ్చజెప్పి నిమ్మరసం తాగించడం ద్వారా దీక్ష విరమింపజేశారు.
Be first to comment on this News / Article!
|