తెలుగులో 'మైనేమ్ ఈజ్ ఖాన్'
షారూక్ ఖాన్, కాజల్ చాలా గ్యాప్ తర్వాత జంటగా నటించిన 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం ఇటీవలే విడుదలై మంచి ఓపినింగ్ కలెక్షన్లు రాబట్టుకుంది. జర్మన్, టర్నీ భాషలతో పాటు వివిధ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రంపై తెలుగు నిర్మాతలు కన్నేశారనీ, రీమేక్ రైట్స్ కోసం సంప్రదింపులు కూడా జరుగుతున్నాయనీ తెలుస్తోంది. సహజంగా నిన్నటి వరకూ బాలీవుడ్ చిత్రాలపై తెలుగు నిర్మాతల కన్ను ఉండేది. ఇటీవల కాలంలో ఈ వైఖరిలో కొద్దిపాటి మార్పు వచ్చింది. టాలీవుడ్ మార్కెట్ పరిధి పెరగడంతో పలు చిత్రాల రీమేక్ కు బాలీవుడ్ తహతహలాడుతోంది. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు నిర్మాతలు ఇటీవల హిందీలో సంచలన విజయం సాధించిన '3 ఇడియట్స్' పై మనసు పడ్డారు. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రం హక్కులను కొని పవన్ కల్యాణ్, సిద్దార్ధ, అల్లరి నరేష్ హీరోలుగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతోందనే వార్త కూడా బలంగా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా 'మై నేమ్ ఈజ్ ఖాన్' రీమేక్ హక్కులకు కూడా పోటీ మొదలైందని తెలుస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారనీ, తమిళ వెర్షన్ లో సూర్య, తెలుగు వెర్షన్ లో జగపతిబాబు నటించే అవకాశాలున్నాయనీ ప్రచారం జరుగుతోంది. ఇక్కడో ముచ్చటైన వ్యవహారం కూడా ఉంది. వారంతంలో రిలీజైన 'మైనేమ్ ఈజ్ ఖాన్' భారీ ఓపినింగ్స్ రాబట్టి వీకెండ్ అయిపోగానే కలెక్షన్ల డ్రాప్ అవుట్ చవిచూసింది. మెట్రోస్ లో కొంతమేర కలెక్షన్లు ఫరవాలేదనిపించుకుంటున్నా, నాన్-మెట్రోస్, చిన్నచిన్న సిటీస్ లో కలెక్షన్ల డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం దుమ్ముదులుపుతోంది. ఈ నేపథ్యంలో 'మై నేమ్ ఈజ్ ఖాన్' రీమేక్ వ్యవహారంలో నిజానిజాలేమిటనేవి వేచి చూడాల్సి ఉంది.
Be first to comment on this News / Article!
|