నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్న'సింహా' చిత్రం ఓ రెండు పాటల చిత్రీకరణ మినహా పూర్తికావడంతో ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉండనుందనే చర్చ జరుగుతోంది. బాలకృష్ణతో ఇటీవల 'మిత్రుడు' చిత్రాన్ని నిర్మించిన కృష్ణ ప్రసాద్ కే మరో చిత్రం చేసేందుకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. 'మిత్రుడు' కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా బాలకృష్ణను కొత్తగా ప్రెజెంట్ చేసిన తీరు ఆయన అభిమానులను అలరించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించన్నారు.
శ్రీవాస్ ఇటీవల గోపీచంద్ హీరోగా దర్శకత్వం వహించిన 'లక్ష్యం' మంచి సక్సెస్ సాధించింది. తాజాగా ఆయన రామ్ కథానాయకుడుగా దిల్ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం దాదాపు పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో ఆయన చెప్పిన ఒక స్టోరీలైన్ బాలకృష్ణకు నచ్చడంతో ఆ ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న 'సింహా' చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఆ వెనువెంటనే శ్రీవాస్ దర్శకత్వం వహించే చిత్రం మొదలవుతుంది.