అంజలి 80వ బర్త్ డే
చెన్నై: సీనియర్ నటి అంజలీదేవి 80వ పుట్టినరోజు సినీ ప్రముఖులు, ఆత్మీయ అతిథుల సమక్షంలో చెన్నైలో శనివారంనాడు కన్నులపండువగా జరిగింది. ముఖ్యమంత్రి కరుణానిధి తన భార్య దయాలు అమ్మాళ్ తో కలిసి వచ్చి అంజలీదేవి శుభాకాంక్షలు తెలిపారు. రాజసులోచన, సరోజా దేవి, షావుకారు జానకి, ఊర్వశి శారద, కాంచన, వెన్నెరాడై నిర్మల, కుట్టి పద్మిని, రమ్యకృష్ణ, రాజశ్రీ, ప్రభు, రామ్ కుమార్, పి.సుశీల, మురళీ మోహన్ ప్రభృతులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఎనిమిదేళ్ల ప్రాయంలో బాలనటిగా పరిశ్రమలోకి అంజలీదేవి అడుగుపెట్టారు. 'మోహని' చిత్రంలో ఆమెను సి.పుల్లయ్య వెండితెరకు పరిచయ చేశారు. ఆ తర్వాత 'గొల్లభామ' చిత్రం ఆమెకు మంచిపేరు తెచ్చింది. ఆ తర్వాత ఆమె తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. 1940లో ఆదినారాయణరావుతో ఆమె వివాహం జరిగింది. అంజలీ ప్రొడక్షన్ అనే సొంత నిర్మాణ సంస్థ స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో 40-50 దశకాల్లోని దాదాపు అందరి అగ్రహీరోలతోనూ ఆమె నటించారు. ఎన్టీఆర్ 'లవకుశ' చిత్రంలో ఆమె సాధ్వి సీతాదేవిగా అసమాన నటన ప్రదర్శించి సీతగానే ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ పాత్రలు చేస్తూ వచ్చారు. తల్లి పాత్రల్లో అంజలి అసమాన నటన ప్రదర్శించేవారు. వయోభారం మీదపడటంతో కొద్దికాలంగా నటనకు దూరంగా ఉన్నారు. సత్యసాయిబాబా భక్తురాలైన అంజలీదేవి నాటి సినీ స్వర్ణయుగానికి ప్రతీకగా నిలవడం మన అదృష్టం.
Be first to comment on this News / Article!
|