గౌతమ్ డైరెక్షన్ లో కమల్
టెక్నికల్ జీనియస్ గౌతమ్ మీనన్ తన తాజా చిత్రం 'ఏమాయ చేసావె'తో యువతరం, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాగచైతన్య-సమంత జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణకు చేరువవుతోంది. ఇదే కథతో తమిళంలో శింబు-త్రిష జంటగా తీసిన 'విన్నైంతాడి వరువాయ' చిత్రానికి కూడా అరుదైన ప్రశంసలే దక్కుతున్నట్టు సమాచారం. ఈ చిత్రం తర్వాత 'లోకనాయకుడు' కమల్ హాసన్ తో ఓ చిత్రానికి గౌతమ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన స్టోరీలైన్ ను ఇటీవల కమల్ కు గౌతమ్ వినిపించారట.
కమల్ హాసన్, గౌతమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు 'వేట్టయాడు విలయాడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయింది. దానినే 'రాఘవన్' పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మళ్లీ కమల్ కాంబినేషన్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించాలని గౌతమ్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. యాక్షన్ కు తావులేని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందట. 'రాఘవన్', 'ఏమాయ చేసావే' చిత్రాలను మ్యూజికల్ హిట్ చేసిన అకాడమీ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ను మరోసారి ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రాఘవన్ చిత్రానికి సమర్పకుడుగా వ్యవహరించిన ఉదయనిధి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో గౌతమ్ తెరకెక్కించనున్నారు.
Be first to comment on this News / Article!
|