త్రిష ఔట్...శ్రియ ఇన్!
రవితేజ కథానాయకుడుగా 'కిక్' వంటి సెన్సేషన్ హిట్ ను ఇచ్చిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ మళ్లీ ఇప్పుడు రవితేజతోనే 'డాన్ శీను' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోందని ప్రకటించడం, సినిమా ఓపినింగ్ పోస్టర్లలో కూడా త్రిష ఉండటం అందరికీ తెలిసిన విషయమే. తొలుత ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియ నటించనుందనే ప్రచారం జరిగినప్పటికీ త్రిష వచ్చి చేరడంతో శ్రియ సెకెండ్ లీడ్ గానో, ఐటెం సాంగ్ లోనో కనిపించనుందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే వీటికి ఇప్పుడు తెరపడినట్టే. త్రిష స్థానంలో మెయిన్ హీరోయిన్ గా శ్రియను ఖరారు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం 'కట్టామీటా' చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న త్రిషకు 'డాన్ శీను' విషయంలో డేట్ల సమస్య తలెత్తడంతో ఆ చిత్రం నుంచి వైదొలగినట్టు తెలుస్తోంది. దీంతో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ ను శ్రియ అందిపుచ్చుకుంది.
శ్రియ గత ఐదేళ్లుగా తమిళ, హిందీ, ఒకటి రెండు బాలీవుడ్ చిత్రాల కారణంగా తెలుగులో మెయిన్ హీరోయిన్ గా నటించలేదు. అయితే అడపాదడపా ఐటెం సాంగ్స్ లో నటించింది. ఆమె నటించిన 'శివాజీ', 'మల్లన్న', 'పిస్తా' చిత్రాలు అనువాదరూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చివరిసారిగా తెలుగులో రవితేజ సరసన 'భగీరధ' చిత్రంలో నటించింది. మళ్లీ ఇన్నాళ్లుకు రవితేజ చిత్రంతోనే తెలుగు స్ట్రయిట్ చిత్రంలో నటించేందుకు అంగీకరించడం విశేషం. పనిలో పనిగా పవన్ కల్యాణ్ కథానాయకుడుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న 'పులి' చిత్రంలో శ్రియ ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది. ఇటీవలే ఈ పాట చిత్రీకరణ కూడా జరిగింది. అన్నట్టు...శ్రియకు కూడా 'శివాజీ' తర్వాత సరైన హిట్ లేదు. ఆ కొరత తీరి టాలీవుడ్ లో మళ్లీ శ్రియ బిజీ అవుతుందనే అనుకుందాం.
Be first to comment on this News / Article!
|