'సింహా' షూటింగ్ కు భద్రత
తెలంగాణవాదులు అడ్డుకోవడంతో నిలిచిచిపోయిన 'సింహా' చిత్రం షూటింగ్ పోలీసుల భద్రతా ఏర్పాట్లు మధ్య తిరిగి మంగళవారం మొదలైంది. బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కీసర మండలంలోని రాంపల్లిదాయర గ్రామంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫైటింగ్ సన్నివేశాలను సోమవారం తీస్తుండగా షూటింగ్ ఆపాలంటూ జేఎసి నేతలు ఆందోళనకు దిగడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటికప్పుడు షూటింగ్ ను నిర్మాత నిలిపివేశారు. అయితే మంగళవారంనాడు ఆయన పోలీసుల అనుమతి తీసుకుని గట్టి భద్రత మధ్య మళ్లీ అదే ప్రాంతంలో షూటింగ్ ప్రారంభించారు.
సినిమాలను అందరూ చూస్తారనీ, దేశవిదేశాల్లో ఉండే తెలుగువారిని సైతం వినోదింపజేసేందుకు తాము సినిమాలు తీస్తామనీ, ఎవరికీ వ్యతిరేకం కాదనీ పరుచూరి కిరీటి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆందోళన చేస్తున్న వారి మనోభావాలను తాము అర్ధం చేసుకోగలమనీ, అలాగే సినిమాలు అడ్డుకుంటే అనేక మంది ఉపాధి కోల్పోతారని వారు అర్ధం చేసుకోవాలని కోరుకుంటున్నాననీ అన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఒక్కటే కాకుండా సినిమాల మీద ఆధారపడి వందలాది కుటుంబాలు బతుకుతున్నాయనీ, ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో 400 మందికి పైగా పాల్గొంటున్నారనీ, అందరికీ సినిమానే ఉపాథి అని ఆయన అన్నారు. దర్శకనిర్మాతలు కోరిన మేరకు షూటింగ్ కు 60 మంది పోలీసులతో భద్రత కల్పించినట్టు పోలీసు అధికారి ఒకరు వివరించారు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామస్థులను ఊచకోత కోసే సన్నివేశాలు చిత్రించడానికి విలన్లు ట్రాక్టర్ లో వచ్చే సన్నివేశాలను ప్రస్తుతం ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|