మిస్టర్ ప్రొఫెషనల్ అల్లు అర్జున్
'గంగోత్రి' చూసినప్పుడు ఎవరూ అల్లు అర్జున్ ను స్టయిలిష్ స్టార్ అవుతాడని ఊహించి ఉండరు. 'బన్నీ', 'ఆర్య', 'దేశముదురు', 'పరుగు'...ఇలా పలు హిట్ చిత్రాలతో ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందుకు అతను తీసుకున్న శ్రద్ధ, పడిన శ్రమ తక్కువేం కాదు. దక్షిణాది హీరోలు ఆహార్యాన్ని అశ్రద్ధ చేస్తారని ఓ హీరోయిన్ అన్నందుకు పట్టుదలతో 'సిక్స్ ప్యాక్' డవలప్ చేసి చూపించారు. వృత్తిపరంగా ఆయనకున్న కమిట్ మెంట్ కు ఇదో నిదర్శనం. తాజాగా ఆయన మరోసారి 'మిస్టర్ ప్రొషెషనల్' అనిపించుకున్నారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న 'వరుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పోరాట సన్నివేశాల సమయంలో బన్నీ చేతికి గాయమైంది. వారం రోజులు విశ్రాంతి తీసుకొమ్మని వైద్యులు సూచించారు. అయితే ఆసరికే సినిమా రిలీజ్ తేదీని నిర్మాత ప్రకటించడంతో బన్నీ ఏమాత్రం చలించకుండా మరుసటి రోజే షూటింగ్ లో పాల్గొని యూనిట్ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అల్లు అర్జున్ అనేసరికి పార్టీ పక్షి అనీ, ఎప్పుడూ మిత్రులు, అమ్మాయిలతో వెలిగి పోతుంటాడనీ అంటారు. ఇది పూర్తిగా ఆయన ప్రైవేట్ వ్యవహారమే అయినా ప్రొఫెషన్ విషయానికి వచ్చేసరికి ప్రొఫెషనల్ అవుతారంటూ ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యులైన కొందరు అల్లుకు కితాబిస్తున్నారు. అల్లు అర్జున్ ఈనెల 5 నుంచి 'వరుడు' చిత్రం చివరి పాట షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఇదే నెల 26న 'వరుడు' పెళ్లి పీటల మీద కూర్చోబోతున్నాడు. అదేనండి...థియేటర్ల ముందుకు రాబోతున్నాడు.
Be first to comment on this News / Article!
|