సుడిగాడు 'బెట్టింగ్ బంగార్రాజు'
పందెం కాయడానికి కాదేది అనర్హం అనేది నా పాలసీ. ఆఖరికి చావు పుట్టుకలపై కూడా పందెం కాస్తుంటాను. 'బెట్టింగ్ బంగార్రాజు' చిత్రంలో నా పాత్ర ఇదే లైన్స్ లో ఉంటుంది...అని ఆ చిత్ర కథానాయకుడు అల్లరి నరేష్ తెలిపారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీ రావు నిర్మిస్తున్న 84వ చిత్రమిది. ఇ.సత్తిబాబు దర్శకుడు. అల్లరి నరేష్ కు జోడిగా కొత్తమ్మాయి నిధి నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. హైద్రాబాద్ లోని ఫిలిం చాంబర్ లో చిత్రయూనిట్ మంగళవారంనాడు ఆ విశేషాలను తెలియజేసింది.
అల్లరి నరేష్ మాట్లాడుతూ, ఇందులో బంగార్రాజుకు సుడి ఎక్కువనీ, అతనితో పందెం కడితో ఊళ్లో ఎవరైనా ఓడిపోవాల్సిందేననీ అన్నారు. 'బెండు అప్పారావు', 'బ్లేడ్ బాబ్జీ' తరహాలో ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు చక్కటి నవ్వుల వినోదం పంచుతుందని అన్నారు. ఇందులోని నాలుగు పాటలు బాగా కుదిరాయని అన్నారు. రెండున్నర గంటల పాటు వినోదం పంచే చిత్రమిదని ఇ.సత్తిబాబు తెలిపారు. ఈకథ విలేజ్ లో మొదలై సిటీకి, తిరిగి గ్రామానికి చేరుకుంటుందన్నారు. గోదవారి జిల్లాల్లో విలేజ్ సన్నివేశాలు తీశామన్నారు. ఇదే నెలలో ఆడియో, వేసవిలో సినిమా విడుదల చేస్తామని చెప్పారు. సీనియర్ నటుడు చలపతిరావు మాట్లాడూతూ, టైటిల్ చాలా బాగుందనీ, నరేష్-సత్తిబాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందనీ చెప్పారు. ఉషాకిరణ్ బ్యానర్ లో అల్లరి నరేష్ తొలిసారి నటించిన ఈ చిత్రంలో మంచి కామెడీతో పాటు చక్కటి సందేశం కూడా ఉంటుందని మయూరి ఆడియో జనరల్ మేనజర్ సుధాకర్ అన్నారు. నటులు సామ్రాట్, అక్షయ్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రానికి లంకపల్లి శ్రీనివాస్ కథ, నాగరాజు గంధం మాటలు, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి పాటలు, కరుణ మూర్తి సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, విజయ్ ఫైట్స్, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|