దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఔదార్యం గురించి తెలుసు కానీ వడ్డన ఏమిటని ఆశ్చర్య పోనవసరం లేదు. ఇది కూడా ఆయన మానవతావాదాన్నే చాటుతుంది. సహజంగా గుప్త దానాలు చేయడంలో రజనీకాంత్ ముందుటారని అందరికీ తెలుసు. ఈసారి ఆయన తనతో పాటు రేయింబవళ్లు కష్టపడి 'రోబో' చిత్రానికి పనిచేసిన యూనిట్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు.
శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా 120 కోట్ల భారీ వ్యయంతో 'రోబో' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తి చేసుకుని సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్యాచ్ వర్క్ గత కొద్దిరోజులుగా చెన్నైలో జరుగుతోంది. ఈ సందర్భంగానే రజనీ ఒకరోజు షూటింగ్ పూర్తయిన వెంటనే యూనిట్ సభ్యుల కోసం స్పెషల్ డిన్నర్ ఎరేంజ్ చేశారు. ఇందుకోసం ఒక ప్రముఖ చెఫ్ ను రప్పించి చవులూరించే వంటకాలు రెడీ చేయించారు. స్వయంగా ఆయనే వడ్డనకు దిగి ఒక్కొక్కరినీ పేరుపేరునా పలకరించి కొసరి కొసిరి తినిపించారు. సూపర్ స్టార్ ననే అహం లేకుండా ఆయన చూపిన ఆప్యాయతకు కదిలిన పోయిన యూనిట్ సభ్యులు రజనీ, ఆయన కుటుంబ సభ్యులు పదికాలాలు పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. దటీజ్ రజనీ...