మళ్లీ శివప్రసాద్ రెడ్డితో నాగ్
విజయాలు, వైఫల్యాలు అనేవి ఎంత పెద్ద హీరోకైనా, పెద్ద బ్యానర్ కైనా తప్పవు. నాగార్జున, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్రసాద్ రెడ్డి కాంబినేషన్ లో పలు హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఇద్దరికీ పాతికేళ్ల అనుబంధం కూడా ఉంది. ఆ అనుబంధంతోనే 'కింగ్' సక్సెస్ తర్వాత మళ్లీ శివ ప్రసాద్ రెడ్డి బ్యానర్ లోనే నాగార్జున తాజాగా 'కేడి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామాక్షి మూవీస్ రజతోత్సవ కానుక ఇయిన ఈ చిత్రం స్క్రీన్ ప్లే గజిబిజి కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూస్తోంది. ఈ క్రమంలో ఎలాగైనా మళ్లీ నాగార్జునకు ఓ సరైన హిట్ ఇవ్వాలనే పట్టుదలతో శివప్రసాద్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. అయితే ముందుగా నాగచైతన్యతో ఓ చిత్రానికి కమిట్ అయినందున ఆ తదుపరి చిత్రం నాగార్జునతో చేసేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు.
నాగార్జున ప్రస్తుతం రాథామోహన్ దర్శకత్వంలో 'పయనం' చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం తర్వాత నాగార్జున-శివప్రసాద్ రెడ్డి కాంబినేషన్ చిత్రం ఉండబోతోంది. ఇటీవల 'బిందాస్' చిత్రంతో దర్శకుడిగా తొలి సక్సెస్ సాధించిన వీరు పోట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఇటీవల వీరుపోట్ల చెప్పిన ఓ స్టోరీలైన్ నాగార్జునకు నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, 'ఏమాయ చేసావె' చిత్రంతో తొలి సక్సెస్ ను చవిచూస్తున్న నాగచైతన్యతో శివప్రసాద్ రెడ్డి చిత్రం ఈ నెలలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అజయ్ భూయాన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు.
Be first to comment on this News / Article!
|