|
|
Articles: Poetry | ఎదురీత - Editor
| |
(చందు)
సెజ్జు, కారిడారు
వాన్ పిక్, ఐటి పార్క్
ఏదైతేనేం
ఏ పేరైతేనేం
నీకు కావాల్సింది ఈ నేల
నిను శాసించేది ఆ డాలరు
అందుకే-
అడంగళ్ళ అజ ఎందుకు
ఫసలీల్లో పస ఏదీ?
నిజాలను నీడంటావ్
నకిలీలే అసలంటావ్
భూ రికార్డుల సిడిల
క్రీనీడలో దాగుంటావ్
దోబూచులాట నీది
దోచుకునే రూటు నీది
సర్వేలు - సర్వం జగన్నాథం
మ్యాపులు - నీ మాయాజాలం
జీవోలు - జానెడు
ఆక్రమణలు బారెడు
పట్టాలు పాసుబుక్కులు
పొజిషన్లు రిజిస్టర్లు
ఏది నీ ప్రాతిపదిక
ఏమిటి ఈ ప్రహేళిక?
డిక్లరేషన్
నోటిఫికేషన్
సెక్షన్ - సెన్షేషన్ - కన్ఫ్యూజన్
కావాలి భూమంతా - నీ పొజిషన్
విత్తేసి పొత్తు కలిపినట్లు
అభివృద్ధి పేర చొరబడ్తావ్
నీ చెర బడ్డ
పోలేపల్లి ఆత్మలు ఘోషిస్తూనే ఉన్నాయ్
శవాల సంస్కారానికి కూడా
ఆస్కారాలుండవని
అపాచీల పాచిలో
జారిపోతున్న జీవితాలెన్నో?
నీవెన్నయినా చెప్పు
ఏదైనా చేయి
ఈ నేల మాది - నీరు మాది
బతుకు మాది - మెతుకు మాది
ఈ నేలలో - గాలిలో
నింగిలో నిప్పులో
నీటిలో సెలయేటిలో
ఎదురీదే వాలు మాకు
మా సంస్కృతి - మా సంపద
మా యాస - మా శ్వాస
భావాలుగ మలుచుకున్నాం
నీ స్వభావాన్ని తెలుసుకున్నాం
జాతిని తాకట్టుపెట్టే
నీ కనికట్టు విద్యని
రసల్ ఆల్ ఖైమా ఎత్తుల్నీ
పోటెత్తి పాతిపెట్టి
ఉప్పెనై చిత్తు చేస్తాం
వాన్ పిక్ పన్నాగాల్ని
బడబాగ్నై తిప్పి కొడతాం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|