|
|
|
|
Articles: Devotion | ధ్వజస్తంభంలో శ్రీనివాసుడు - Sairam Sairam
| |
శ్రీ చందోలు రాఘవనారాయణశాస్త్రి గారు మ్రొక్కులు తీర్చేందుకు ఒకసారి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధికి చేరారు. దర్శనం కోసం అందరితో పాటు క్యూలో నిల్చొని ఉన్నారు.
వీరికి ముందున్న ఒక భక్తుడు స్వామివారి ముందు నమస్కరిస్తూ ఒక్క నిమిషం పాటు నిలబడి ఉండగా, అక్కడివారు అతడిని నిర్ధాక్షిణ్యముగా ప్రక్కకు లాగుతూ బలవంతంగా నెట్టివేశారు.
పాపమా భక్తుడు స్వామివారిని కనులారా చూడలేకపోయాడు. ఇదంతా చూస్తున్న శాస్త్రిగారు మిక్కిలి ఆవేశముతో అతడి జబ్బ పట్టుకొని 'దేవుడు ఆలయంలోనే ఉన్నాడా ఏమి? నేను చూపిస్తారా రాఁ' అంటూ గర్భాలయం నుండి వెలుపలికి తీసుకొని వచ్చారు.
నేరుగా ధ్వజస్తంభము దగ్గరకు తీసుకువచ్చి పైకి వ్రేలెత్తి చూపి, 'స్వామి అక్కడ ఉన్నాడు... చూడు' అంటూ చూపారు శాస్త్రిగారు.
పైకి చూసిన ఆ భక్తుడు హృదయంలో పెల్లుబికుతున్న ఆనందాన్ని తట్టుకోలేక గంతులు వేస్తూ, స్తోత్రాలు చేస్తూ నమస్కరిస్తున్నాడు.
శాస్త్రిగారు అతడి వీపున తడుతూ 'ఏమిట'ని అడగ్గా, అతడు 'అదిగో స్వామి కనపడుచున్నాడు. శంఖ, చక్ర, గదా పద్మ వనమాలలతో, నిండయిన పంగనామాలతో కన్నుల పండువగా దర్శనమిస్తున్నాడు' అంటూ ఆనందంతో కేకలు వేస్తూ గెంతులు వేస్తున్నాడు.
దర్శనానికి వచ్చిన భక్తులందరూ గర్భాలయంలోకి వెళ్ళడం మాని, ధ్వజస్తంభం చుట్టూ గుమిగూడారు.
అచ్చటి అర్చకులందరూ తమ తప్పు తెలుసుకొని శ్రీ శాస్త్రిగారికి, ఆ భక్తునికీ నమస్కరిస్తూ గర్భాలయం లోపలికి రమ్మని బ్రతిమాలి, తిరిగి యధేచ్ఛగా దర్శనం చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.
(భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్య స్వామి సద్గురు కృప నుండి)
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|