|
|
Articles: Poetry | నా అక్షరాస్త్రాలు..! - Site Administrator
| |
(నరసింహరాజు)
ఒళ్ళంతా కళ్లు చేసుకుని...
నా అక్షరం కన్నీళ్ళు పెడుతుంది!
యాభై ఆరు అక్షరాలు...
యాభై ఆరు దారులై కలహించుకుంటుంటే...
నా బీజాక్షరం కన్నీళ్ళు పెడుతుంది!
మనం పోరాడాల్సింది...
అవినీతి మీద... అణచివేత మీద
అమెరికా మీద... ఆంగ్లం మీద కదా..
మరి చేయి చేయి కలిపి సాగే
వర్ణమాల చేతులు నరుకుతున్నారేంటి?!
అక్షరాల నెత్తురు పారే చోట..
చైతన్యం నెత్తావి ఎలా వీస్తుంది?!
నిన్నటిదాకా..
దొరసాని ఇంట్లో..
దాసియైన అక్షరం అమ్మ...
నేడు తన ఇంట్లో తానే
ఓ బానిస!
అక్షరాల్ని తెల్లగద్దలు తన్నుకుపోతుంటే..
పహారా కాయాల్సిన బిడ్డలే...
పసందుగా నవ్వుకుంటున్నారు
ఫారిన్ మద్యం తాగుతూ...
నాటుకోడి మాంసం నంజుకుంటున్నారు!
అక్షరానికి గాయమైతే
నా గుండెకు రక్తం కారుతుంది!
ప్రాచీన ఆలయాల్ని..
పడగొడుతున్నట్లుగా...
అక్షరాలపై - అత్యాచారాలు, హత్యాచారాలు.
అక్షరాలను...
శాంతి పావురాలుగా ఎగరేస్తున్నా...
ఆంగ్లోన్మాదుల తూటాలకు
నేల రాలుతూనే ఉన్నాయ్!
ముసుగులు మాట్లాడం ఆగిపోయాకే
నా అక్షరాల యుద్ధం మొదలైంది.
మంచె మీద వడిసెలు విసురుతూ...
నా అక్షరాల పొలాన్ని నేనే పహారా కాస్తా...
నా చివరి రక్తపుబొట్టు వరకు
అక్షరానికి అంగరక్షకుడనై ఉంటా...
కాలానికి వామన అవతారమైన...
కలమే నా ఆయుధం!
నా అమ్ములపొదిలో
ఇప్పుడు యాభై ఆరు అస్త్రాలు!
నా తల మీద...
తెలుగుతల్లి జెండా రెపరెపలు!!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|