|
|
Articles: Poetry | పిలుపుల వలస! - Site Administrator
| |
(మాధవీ సనారా)
మన కుటుంబ జీవన పొలంలో
ఎన్ని ఆత్మీయ పిలుపుల
పంటలు పండించుకున్నాం
ఎన్ని అనుబంధాల
అల్లికలు అల్లుకున్నాం.
ఇప్పుడా కౌటుంబిక పొలంలో
పరాయి గాలివానల తీవ్ర తాకిడికి
కుంభవృష్టికి
ఆంగ్ల వరదలో కొట్టుకుపోయి
అమందానంద కందళిత
హృదయారవిందమొనరించే
పిలుపుల పంటలన్నీ
సర్వనాశనమయ్యాయి.
మనుషులూ, పక్షులే కాదు
కమ్మని పిలుపులూ
వలసదారి పడుతున్నాయి.
ఒకప్పుడు
'అమ్మా' అనే పిలుపుల వానలో
ఎన్ని ఆప్యాయతల పుష్పాలో వికసించేవి
ఎన్నెన్ని అనురాగ ఫలాలో పండేవి
'నాన్నా' అన్నా... 'అన్నా' అన్నా...
ఆ పిలుపుల సముద్ర మథనంలో
పాలపొంగులా
ఎంత అమృతాభిషేకం జరిగేది.
కొత్త సామాను రావడంతో
పాత సామాను ఇనుపకొట్టుకు తరలిపోయినట్టు
తెలుగు పిలుపుల సామానుల్ని
ఒకటొకటీ జారవిడుచుకుంటుంటే
మన మనుగడ నిస్సారం కావడంలేదా?
తెలుగు సరస్సు నిండా
ఇంత ఆంగ్ల డెక్క విస్తరిస్తుంటే
తెలుగు పిలుపుల పూవుల ఉనికి
కడతేరిపోవడం లేదా?
పాత ఇళ్ళను పడగొట్టేసుకొని
అంతమందీ
లంకంత డూప్లెక్స్ ఇళ్ళవైపే
పరుగులు పెడుతుంటే
మన మధురమైన జ్ఞాపకాలు
వారసత్వపు చిహ్నాలు సమాధైపోవా?
ఒకప్పుడు ఎలకోయిల
పంచమస్వరంలా వినిపించిన
అమ్మా! అనే పిలుపు
నా అనే భావాన్ని పురుడుపోయించే
నాన్నా అనే పిలుపు
మధురిమల స్వరఝరులు కురిపించే
తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ,
పిన్ని, చిన్నాన్న లాంటి
నిర్దిష్ట సంబంధం పరిమళించే
తెలుగు పిలుపులెన్నో నేడు
ఆంగ్లభాష వరదలో
ఎలా కొట్టుకుపోతున్నాయో చూడు.
మనిషి చుట్టూ
జాతీయతా సూర్యుడి చుట్టూ
అనుబంధాల పిలుపుల వలసల్ని నిరోధించి
అచ్చమైన తెలుగువాడిగా
తెలుగు పిలుపుల
ఆదాన ప్రదాన అమృతాభిషేకంలో
తెలుగు వెన్నెల సోనలో
తడిసిపోవాలి.. తరించిపోవాలి.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|