TeluguPeople
  are the trend-setters

 
Articles: Devotion
సాయి జ్ఞానబోధ
- Mr. Pratap Cherukuri Pratap
  Page: 1 of 1    
సాయి భక్తాగ్రేసరుడైన దాసగణు మహారాజ్ తన కీర్తనలు, హరికథ సత్కాలక్షేపం, ఉపన్యాసాల ద్వారా సాయినాధుని మహిమలను, అవతార ప్రశస్తిని దేశం నలుమూలలా ప్రచారం చేశాడు. తద్వారా సాయినాధుని దర్శనం కోసం నిత్యం వేలాది మంది శిరిడీ వస్తుండేవారు. ఒకసారి దాసగణు తన కీర్తనల పరంపరను ముగించుకొని శిరిడీకి వచ్చేందుకు కొపర్గాంలో రైలు దిగాడు. మాటల సందర్భంలో అతనికి కోపర్గాం స్టేషన్ మాస్టరుకు మధ్య వాగ్వివాదం చెలరేగింది. సాయి గురించి ఆక్షేపించదగిన మాటలను ఆ స్టేషన్ మాస్టర్ అన్నపుడు ఒకసారి శిరిడీ వచ్చి సాయి ప్రభువును దర్శించుకున్నాక మాట్లాడమని దాసగణు సమధానం చెప్పాడు. సరే అని అతనితో బయలుదేరి స్టేషన్ మాస్టర్ శిరిడీకి వచ్చాడు. మసీదు ముందు వరుసగా మట్టికుండలను బోర్లిస్తున్నారు సాయినాధులు. వారికి నమస్కరించి ఎందుకలా కుండలను బోర్లిస్తున్నారని దాసగణు అడుగగా 'ఏం చెయ్యమంటావు గణు? నా వద్దకు వచ్చేవారి హృదయాలన్నీ బోర్లించే కుండల వంటివి. ఎంతగా నీరు నింపుదామన్నా సాధ్యపడడం లేదు' అని చమత్కారంగా అన్నారు. కొంచెం అర్థమయ్యేలా వివరించండి బాబా అని దాసగణు ప్రార్ధించగా 'మానవుల హృదయాలు ఖాళీకుండల వంటివి. విశ్వాసంతో వస్తే కుండలలో నీరు నింపినట్లు వారి హృదయాలలో జ్ఞానాన్ని నింపవచ్చు. కానీ అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కుండల వంటివి. వాటిపై ఎంత నీరు పోసినా పక్కకు జరిపోతాయి గాని నిండవు' అని బాబా బదులిచ్చారు. ఆ మాటలకు కోపర్గాం స్టేషన్ మాస్టర్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అక్కడ ఉన్న మూడు రోజులలో ఒక కొత్త ప్రపంచాన్నే చూశాడు. సంతానం లేని వారు సంతానాన్ని, నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు. రోగాలతో బాధపడేవారు మందూ మాకు లేకుండానే ఆరోగ్యవంతులై తిరిగి వెళ్తున్నారు. ఏడుస్తూ వచ్చిన వారు తమ బాధలకు పరిష్కారం పొంది నవ్వుతూ హాయిగా వెళ్తున్నారు. కులస మతస వర్గ, ప్రాంతీయ భేదాలు లేకనే అందరికీ సమానంగా సాయి అనుగ్రహ ఫలం దక్కుతోంది. మా వల్ల కాదని వైద్యులు చేతులెత్తేసిన వారందరికీ సాయి అభయ హస్తం అందించిన తోడనే రోగాలు మటుమాయం. దుఖం, అశాంతి, ఆందోళన అన్నవి శిరిడీలో మచ్చుకైనా కనిపించడం లేదు. అంతటా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రశాంతత నెలకొని ఉంది. సాయిని వట్టి మోసగాడని వాదించిన కోపర్గాం స్టేషన్ మాస్టరుకు ఇదంతా చూసేసరికి అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి జ్ఞానోదయం అయ్యింది. సాయి కేవలం యోగ సామ్రాట్టే కాక పరిశుద్ధ పరమేశ్వర అవతారం అని గ్రహించాడు. తీవ్రమైన పశ్చాత్తాపంతో వెళ్ళి సాయినాధుని కాళ్ళపై పడి తన తప్పులకు క్షమార్పణ వేడుకున్నాడు. కరుణాసముద్రుడైన సాయి దేవుడు అతనిని శీఘ్రమే క్షమించి ఉదీ ప్రసాదంతో ఆశీర్వదించి పంపించారు. ఒకసారి బాపూసాహెబ్ జోగ్ తన స్నేహితునికి పదిహేను వందలు అప్పు ఇచ్చాడు. ఇద్దరూ అప్పు తాలూకు వివరాలను స్టాంపు పేపరుపై రాసుకున్నారు. ఆర్ధికపరమైన కష్టాలలో ఉన్నందున ఆ స్నేహితుడు గడువు లోపల అప్పు తీర్చలేకపోయాడు. అప్పుడు జోగ్ ఆగ్రహంతో నిప్పులు చెరుగుతూ ఆ స్నేహితునిపై దావా వేయడానికి సిద్ధమై సాయి అనుమతి కోసం మసీదుకు వెళ్లాడు. సాయి అతనిని శాంతపరుస్తూ 'బావూ, నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్వు ప్రశాంతంగా ధ్యానం చేసుకో' అని అన్నారు. 'అదేమిటి బాబా అలా అంటారు. నేను దావా వేయనిదే ఒక్క పైసా కూడా మిగిల్చేలా లేడు వాడు. ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు. కష్టాలలో ఉన్నాడని ఇస్తే ఇలా ఎగ్గొడతాడనుకోలేదు' అంటూ అసహనం ప్రదర్శించాడు జోగ్. జోగ్ ఎంత బ్రతిమిలాడినా శిరిడీ విడిచిపోవడానికి అతనికి సాయి అనుమతి ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత జోగ్ స్నేహితుడు డబ్బు మొత్తం తీసుకువచ్చి ఇవ్వగా వడ్దీ కూడా ఇస్తే గాని తీసుకోనని జోగ్ మంకుపట్టు పట్టాడు. ఈ తంతు జరుగుతుండగా సాయి జోగ్ కు కబురుపెట్టారు. మసీదుకు వచ్చిన జోగ్ కు కమ్మగా చీవాట్లు పెట్టారు 'అత్యవసరమైతే తప్ప ఎదుటి వారి నుండి వడ్డీతో తీసుకోవడం మహా పాపం. అందువల్ల నువ్వు ఆచరించిన ధర్మమంతా వ్యర్ధమైపోతుంది. ఎదుటివారు కష్టాలలో ఉన్నప్పుడు ఇతోధికంగా సాయం చేయడం మానవుల కనీస ధర్మం. పూర్వజన్మ కర్మ వలన అతను కష్టాలకడలిలో కూరుకుపోయాడు. అందువలన నీ డబ్బును తిరిగివ్వడం కాస్త ఆలస్యమైంది అంతమాత్రాన అతనిని వడ్డీ అంటూ పీడించుకు తినడం తప్పు' అన్నారు. బాబా మాటలతో జోగ్ కు జ్ఞానోదయమైంది. తన స్నేహితుని నుండి అసలు మాత్రమే తీసుకొని పంపేశాడు. రాదనుకున్న డబ్బును వచ్చేలా చేసిన సాయి దేవునికి ఆ డబ్బు అంతా సమర్పించాడు. కాని సాయి కొద్దిగా దక్షిణగా స్వీకరించి మిగితాది అతనికి తిరిగి ఇచ్చేశారు. భగవంతుడు దయతో ప్రసాదించిన ధనమును చక్రవడ్డీ అంటూ వడ్డీలకు తిప్పుతూ, సమయానికి కట్టని బడుగులపై కొరడా ఝళిపించి వారిని జలగల్లా పీల్చే నేటి వడ్దీ వ్యాపారులకు ఈ లీల ఒక కనువిప్పు. సర్వం శ్రీ శిరిడీ సాయినాధ పాదారవిందార్పణమస్తు.

Read 3 Comment(s) posted so far on this Article!

  Page: 1 of 1    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.