|
|
Articles: Devotion | bAsara tallI - Mr. Ramakantha Rao Chakalakonda
| |
పల్లవి. ఆసరా యిచ్చే బాసర తల్లీ
ఆశలు తీర్చవే అమృత వల్లీ! |ఆసర|
అనుపల్లవి. వాసిగ శ్రీహరి భక్తుల ఎదలో
వాసము ఉండెడి వెన్నెల వెల్లీ. |ఆసర|
1. వేదములే నీ వీణెపై పలుక
మధుర నాదముల గానము లొలుక
మోదముతో మా ఎదలే కులుక
ఆదరించవే అమృత వల్లీ! |ఆసర|
2. సరిగమలే నీ సొంపులు కాగ
స్వర జతులే నీ పద గతి కాగ
అరువది నాలుగు కళాకేళిగ
నిరతము మమ్ము బ్రోవవే తల్లీ! |ఆసర|
3. ధవళ వస్త్రముల దీప్తులు మెరయగ
నవ్వుల జల్లుల వెన్నెల కురియగ
పువ్వుల వానలు నీ పలుకులుగ
కవితలే సొంపులై కులికెడి తల్లీ.! |ఆసర|
4. వినయ విధేయత వన్నెల పూలతో
మన్నన చేసి మ్రొక్కెద నిన్నే
కన్నుల లోన కరుణను నింపి
నన్నిక బ్రోవుము నిరతము తల్లీ! |ఆసర|
5. చక్కటి చదువుల సంపదలిచ్చి
వాక్కుల లోన వన్నెలు గూర్చి
పెక్కు విద్దెల ప్రసాద మిచ్చి
మ్రొక్కులు తీర్చవే మమతల వల్లీ ! |ఆసర|
--- చాకలకొండ రమాకాంతరావు,, Cincinnati OH USA
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|