|
|
Articles: Drama | తెలుగు విలువల ఉగాది - Editor
| |
తేనెను కడుపునిండా తాగిన ఈగలు జతకూడి, విషాదకర రసాత్మక వాక్యాల్లాగ పట్టుచుట్టూ వరుసకట్టి తిరుగుతున్నాయి. తుమ్మెదల కన్నీళ్ళతో మందారం పూగొట్టాలు నిండాయి. గన్నేరు పువ్వుల్లోంచి పసుపూ, ఎర్రబంది పూల్లోంచి కుంకుమా నేలను రాలుతున్నాయి.
రాంబలం పళ్ళు పిగిలిపోయాయి. సీతాఫలాలు పగిలిపోయాయి. గెలవేస్తున్న అరటిపువ్వు గత్తుక్కుమని ఆగిపోయింది...పద్యం మధ్యలో తెగిపోయిన రాగంలాగ.
పాడ్యమి పొగమంచు - ఈ ఊరి ఉగాదిని దట్టంగా అలముకుంది. గడచిన రాత్రంతా భూగోళం అటు దిరిగి ఇటు దిరిగి... విదయలో సర్దుకుంది. రైతుకుంటుంబంలో మెలితిరిగిన నవనాడులూ వసులుకున్నాయి. ఉత్తరాయణ సూర్యుడి తలమీద పండుజుత్తు లాగుంది తెల్లని మేఘం. కళింగ సముద్రంలో కాళ్ళు కడుక్కొని, శాలిహుండం కొండవరకు నడిచి వచ్చినట్టు వుంది భూమి. నాగళ్ళ సజ్జులు పొలాల్లో నిలబడి బిక్కచచ్చి తూర్పు దిక్కును ఏటవాలుగా చూస్తున్నాయి. మిరప చేళ్ళు పసుపూ కుంకుమలు పూసుకోవడం మానేశాయి. చెరకుగడలు రసం పట్టడం మానేసి పిప్పిగా నిలుచున్నాయి. వంగతోటలో పిందెలు పుచ్చులై నేలన రాలిపోతున్నాయి.
బిగబట్టివున్న పెదాలు పిగిలి - రైతు ముఖం బద్దలైపోతుందా అన్నట్టుంది. ఖండాంతరంలో ప్రళయమొచ్చి, నీళ్ళొచ్చి ఆమె కళ్ళలో దూరినట్టుంది. కూతురి శరీరాన్ని మొత్తంగా తాకి, తాకి, దాని కడుపుమీద బుర్ర (తల) కొట్టుకొని, తడిమి తడిమి, పడిపడి బోరున ఏడ్చిందామె - నడిపిదాయి తన బొడ్డుకొంగు కుచ్చుల్లో దాచి వుంచిన మడత కాగితాన్ని, ఆ పిల్ల పొత్తికడుపులో చెయ్యెట్టి తీసి... రహస్యంగా దాచి వుంచిందా ముగ్గురాడ పిల్లల తల్లి... రైతు భార్య... మొగుడికైనా చూపదలచలేదు... ఎందుకో పాఠకులకు తెలుసుండాల. తెలుగక్షరాలు నేర్చుకున్నాక, చదివి, తెలుసుకొని, విషయం అందరికీ చెబుతాననుకుంది ఆ తల్లి .
ఆ రైతు కుటుంబం ఎముకల మూలుగుల్లో రక్త ఉత్పత్తి గనులు కూలిపోయాయి.
సాయం సమయమయ్యింది. స్మశానంవైపు కెళ్తున్న సూర్యుడి వెనుక ఆకాశం - 'హిమోగ్లోబిన్'తో అలికి నల్లని ముగ్గెట్టినట్టుంది. గుండెలు బరువెక్కి గుభిల్లుమన్నాయి. దీపాలు వెలిగాయి.
వైరుధ్యాల చీకటిలో ఈ మెలుకువలేంటో? క్షితిజరేఖలో మోగుతున్న మృత్యుశబ్దాల కర్థమేంటో!
కార్యముంది, కారణముంది, సంబంధముంది, ఘర్షణవుంది, ఐఖ్యత వుంది. పరిస్థితి చేయి దాటిపోతోంది! అయినా -
ఈ విశ్వసౌందర్యం ముందుముందు మరోలా వుంటుంది... శ్రమసౌందర్యంతో ఉద్దీపిస్తుంది. ఇంకా చిక్కబడుతుంది. కొత్త కొత్తగా వుంటుంది... ప్రపంచీకరణపళ్ళు ఊడగొడుతుంది.
కూడుకన్నా అమోఘమైన రుచీపచినీ, గుడ్డకన్నా గొప్ప సౌందర్యాచ్ఛాదననీ, గూడుకన్నా ఎంతో విశాలమైన, లోతైన 'స్వర్గాన్నీ' ఆశించి, సఫలీకృతం కావడానికి పరంపర పోరాటక్షేత్రాలు నిర్మించాల్సి వుందీ ప్రపంచంలో. అందుకోసం - వీపున అగ్నిపర్వతాన్ని మోయాలి... దానికి నవనాడులను చుట్టి, శ్రమ సముద్రాన్ని చిలికి మధించి - జీవరసాగ్ని సారాంశాన్ని సృజించి అందరికీ పంచాల్సి వుంది... మున్ముందున ఇంకా వుంది.
విరోధి ఉగాది కుంటుతూ నడుస్తోంది. నేలన పడిపోయివున్న నిచ్చెన దాపులు (మెట్లు) ఎక్కి నడుస్తోంది కాలం.
కల్లంలో వ్యవసాయ పనిముట్లు చెల్లాచెదురుగా పడివున్నాయి.
తుమ్మలజోరి పొలంలో తొంగున్న తూరుపు లేచి తలపాగ చుట్టుకుంటోంది.
తన చుట్టూ తాను తిరుగుతూ కొత్త ఆశల్ని కల్పిస్తున్న భయంకరమైన ఈ భూలోకానికొక దండం.
సూర్యమండంలతో సహా ఖగోళంలో పరిభ్రమిస్తూ కొత్త సౌందర్యాలను ప్రదర్శిస్తోన్న విభ్రమాత్మకమైన ఈ భూమండలానికొక దండం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|