|
|
Articles: Drama | ప్రేమ దొంగలు... - Mr. GodDevendra GodDevendra
| |
సుం:- వద్దురా! (అతి కష్టం మీద మాటాడుతున్నాడు.) మీ రెవ్వరూ ఇక్కడ్నించి కదలొద్దు. డాక్టర్ని పిలిచినా ఏం ప్రయోజనం ఉండదు.నా ఈ చివరి క్షణాల్లో నా ఆత్మకి శాంతి లేకుండా చెయ్యకండి. ఒరే ప్రకాశం నీ ప్రేమని నేనర్థం చేసుకున్నానురా! అందుకే-నీ ప్రేమకి అడ్డం రాకూడదనే నేనీ పని చేశాన్రా! (కళ్లు మూసి చెయ్యి వాల్చేస్తాడు.)
శే:- ఒరే! మనందరికీ ప్రేమలో గ్రీన్ సిగ్నల్స్ వచ్చాయనుకుని వీడింత అఘాయిత్యానికొడిగట్టాడ్రా! ఇలా వీడు చేస్తాడని తెలిస్తే .. హాస్యానిక్కూడా వీడితో అబద్ధాలు చెప్పేవాళ్లం కాదురా!
ప్ర:- మీరు అబద్ధాలు చెప్పారా?
ఏ:- అవును గురూ! సుందరం రాసిచ్చిన పేమలేకలవల్ల నాకు వందనం దొరికిందని నేనబద్ధమాడాను. వందనం నన్ను ప్రేమించిందని నమ్మి దగ్గర కెడితే ఇదిగో నా గూబ గుయ్య్ మంది!
శే:- అవున్రా! సుందరం ఏడుకొండలికి వందనం పేరిట రాసిచ్చిన ప్రేమలేఖల్ని,నేను పోస్టు చేస్తానని చెప్పి ఏడు కొండల్నించి తీసుకుని పోస్టు చేశానని అబద్ధ మాడే వాడిని. ఆ తరవాత నేనే వందనం రాసినట్టుగా ప్రేమలేఖ రాసి ఏడుకొండల పేరిట పోస్టు చేసే వాడిని. మొన్నా మధ్య ఈ విషయం తెలీని ఏడుకొండలు తనే డైరెక్టుగా వందనానికి ఉత్తరం పోస్టు చేశాడు.దాంతో వందనం చేతిలో వాడి గూబ పగిలింది. సుందరంగాడి మాటలట్టుకుని నేను విమల వెంట పడ్డాను. ఆ అమ్మాయి జెమా జెట్టీ ల్లాటి మనుషుల్ని నా మీదకుసి గొల్పింది. దాంతో నేను జ్వరం తెచ్చుకుని మంచమెక్కేశాను. ఇక విమల వీధి వైపు వెడితే ఒట్టు!
ప్ర:- మరి నువ్విందాకిచ్చిన ఆ ఇన్విటేషన్సు మాటేమిటి?
శే:- ఓ !అవా?! నేను ప్రేమలో సక్సెస్ అయ్యానని మిమ్మల్ని నమ్మించి ఉడికించాలని మా బాబాయి ప్రింటింగ్ ప్రెస్ లో కూచుని సరదా గా ఓ పది ఇన్విటేషన్లు ప్రింట్ చేశాను.
ప్ర:- (బాధగా) మనమందరం సుందరాన్ని బాధ పెట్టిన వాళ్లమేరా! అసలు వాడిలాటి వెధవ పని చేస్తాడంటే, నేను తాయారుని ప్రేమించే వాడినే కాదురా. నేనే వాడికోసం తాయారును త్యాగం చేసే వాడినిరా!
[ ప్రకాశం ఈ మాటలనగానే సుందరం మంచం మీంచి దిగ్గున లేస్తాడు.]
సుం:- ఒరే! ప్రకాశం !! ఆ మాట మీదే వుండు. ఒరే అవతారం ఏడుకొండలూ మీరిద్దరూ దీనికి సాక్షుల్రా!
ప్ర:- ఏవిటీ? నువ్వు విషం తాగలేదా?
సుం:- లేదు. నేనిలా ప్రేమలో ఎదురు దెబ్బలు తిన్నప్పుడల్లా-ఇలాగే చచ్చి బతుకుతుంటాను.ఇది నాకు మామూలే!
ప్ర:- మరింత వరకూ నువ్వు చచ్చినట్టు నటించడానికి ఏం మింగి చచ్చావ్?
సుం:- మీ రెవరైనా తినేస్తా రేమోనని మల్టీ విటమిన్ టాబ్లెట్లు కొని సీసా లో
వేసి దాని పైన 'పాయిజన్' అనే లేబుల్ రాసి అవి మింగి చచ్చను.
శే:- భేష్ రా! నువ్విప్పుడు అసలు సిసలైన నటుడివనిపించుకున్నావురా!నీ నటనతో మమ్మల్నందర్నీ అదర గొట్టేశావు కదరా!
ప్ర:- ఇలా నాటకాలాడే వాళ్లంటే నా కసహ్యం.అందుకే నా తాయారుని నేనొదులుకోను.
సుం:- అదుగో ప్లేటు ఫిరాయించేస్తున్నాడు చూడండ్రా!
ఏ:- తప్పు గురూ! మాట తప్ప కూడదు. తాయారును సుందరం గాడి కొగ్గెయ్యి.
ప్ర:- వాడు విషం తాగుంటే అలాగే చేసే వాడిని.
శే:- వాడు విషం తాగుంటే నువ్వు చేసే దేంటి బోడి?వాడు చస్తాడు నువ్వు తాయార్ని పెళ్లాడతావు.
ప్ర:- సర్లే! ఏం చేస్తాం? నీ తరఫున మెజార్టీ ఉంది.
సుం:- ఇంకెప్పుడూ నా తాయారుకు నువ్వు ఫోన్లు చెయ్యనని మాటియ్యి.
ప్ర: సరే! మాటిచ్చా లే!
బవ్య:- హలో! ... రాంగ్ నంబర్! హాఁ! హతవిథీ నీ దృక్కులు ఎంత కౄరంబులయ్యెడిన్?!(పక్కకు తప్పుకుంటాడు)
సుం:- నీవెప్పుడూ రాంగ్ నంబర్లే! ఇప్పుడు నేను ఫోను చేస్తాను చూడు.(ఫోనందుకుని డయల్ చేసి) హలో! హలో!! ఎవరూ? తాయారు గారా? నమస్కారమండీ! నేనూ సుందరాన్ని.ప్రకాశం గాడిప్పుడే ఇద్దరు సాక్షుల ముందు మిమ్మల్ని నా కోసం త్యాగం చేశానని ఒప్పుకున్నాడండీ! సో-మనమిక ఏక ఛత్రాధిక ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించుకుని ఒకర్నొకరం నిరభ్యంతరంగా లౌలీ గా లౌ చేసుకోవచ్చండీ! హఁ! అలాగా!హ్హఁ హ్హహ్హఁ హ్హాఁ!! సర్లెండి! మిమ్మల్ని త్యాగం చెయ్యడానికి ప్రకాశం ఎవడంటారా? ... ఏవిటీ? మీరు ప్రకాశాన్నే మనసారా ప్రేమిస్తున్నారా? అతణ్ణే పెళ్లి చేసుకుంటా నంటారా? పోన్లెండి. ఇది నా దురదృష్ట మనుకుంటాను.(ఫోను పెట్టేస్తాడు)
సుం:-(ప్రకాశం కేసి తిరిగి) ఒరే ప్రకాశం నేనోడి పోయాన్రా! నాది వన్ సైడెడ్ లౌ! నీ టూ వే లవ్ ట్రాక్ ముందు నేను తలొంచక తప్పదురా! తాయారు నిన్నే ప్రేమిస్తోందట. నిన్నే వివాహ మాడుతుందట!
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|