|
|
|
|
Articles: Drama | నరకానికి పూలదారి!? - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
వి : నువ్వు నన్ను కొట్టగలవు. నా నోరు మూయించగలవు. కాని, ఈ లోకం నోరు ఎలా మూయించగలవు? అది కోడై కూస్తోంది!
చం : (బాధగా) విశాలా!!
వి : ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. నీ చెల్లెలి పతనానికి కారకుడివి నువ్వు. స్త్రీని చపలచిత్తురాలు, అబల అంటారు. పురుషుడివైన నువ్వే కామ సాహిత్యాలను తీసుకు వచ్చి, ఇంట్లో పెట్టుకు చదువుతుంటే... ఒక యుక్తవయసులో ఉన్న కన్నెపిల్ల - మనసులో చెలరేగే కోర్కెలను ఎలా అణచుకోగలదు? తన పెళ్లి చెయ్యవలసిన అన్నయ్యే పక్కదార్లు తొక్కుతుంటే, మనసు కళ్లెం వేసుకోలేని నీ చెల్లెలు నీ తోవే తొక్కింది.
చం : విశాలా! నన్ను క్షమించు విశాలా!! (దగ్గరకు వెళ్లి విశాల చేతులు పట్టుకుంటాడు. విశాల చేతులని విదిలించుకుని పక్కకు తొలుగుతుంది.)
వి : హుఁ !క్షమ!! ఎంత తేలిగ్గా మాట్లాడావు? రెండక్షరాలతో ఇన్నాళ్లుగా నీవు నా పట్ల చూపిన కాఠిన్యాన్నంతటినీ కడిగిపారేసుకుంటున్నావు. ఆ నాడు నీ మాటలతో, నీ చేతలతో నా హృదయాన్ని రంపపుకోత కోశావు. ఇప్పుడు నాలో క్షమించే శక్తి పూర్తిగా నశించిపోయింది. ఆడదంటే అవసరమైనప్పుడు దగ్గరకు తీసుకుని, అవసరం తీరిపోయాక నేలకేసి కొట్టే గాజుపాత్ర లాంటిది కాదని మాత్రం తెలుసుకో!
చం : తెలుసుకున్నాను విశాలా! అన్నీ తెలుసుకున్నాను. అమావాశ్యనాటి గాఢ తమస్సులో, మెరుస్తున్న మిణుగురుల కాంతిలో ఇన్నాళ్లూ ప్రయాణం చేశానని తెలుసుకున్నాను. క్షణికమైన సుఖాలకు బానిసనై గురవయ్య చూపిన మార్గంలో పయనించి, నా వాళ్లందరినీ విస్మరించి నాకు నేనుగా పతనమైపోయానని తెలుసుకున్నాను... రెండు చేతులా లంచాలు పట్టాను. చెల్లెలి భవిష్యత్తుకు బంగారుబాట వేయాలనుకున్నాను. కాని, విశాలా! ఆ డబ్బు! ఆ పాపిష్టి డబ్బు! ? నా మానవత్వాన్ని మంటగలిపి, నాలో దానవత్వాన్ని రెచ్చగొట్టింది. అందరూ నన్ను అసహ్యించుకునేలా ప్రవర్తించేలా చేసింది. ఆఖరికి చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకున్నాక, చెల్లెలు లేచిపోయాక, కొడుకు తాగుబోతయ్యాడని ఈ రెండు కళ్లూ చూశాక, ఇప్పుడు నా కళ్లు తెరుచుకున్నాయి.
ఆఁ! విశాలా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇన్నాళ్ల నా వక్రమార్గం నాకు సక్రమమార్గం సూచిస్తోంది. బంగారాన్ని కొలిమిలో వేసి కాల్చి శుద్ధిచేశాక, ఇనుప సమ్మెటలతో కొడితే ఎలా ప్రకాశిస్తుందో, అలాగే ఎన్నో దెబ్బలు తిన్న నా జీవితం స్వచ్ఛతను పొంది ప్రకాశిస్తోంది. నువ్వు జరిగిన విషయాలన్నీ ఒక పీడకలగా భావించి మర్చిపో విశాలా! మనమందరం హాయిగా బతుకుదాం! హాయిగా బ్రతుకుదాం విశాలా!
వి : ఇప్పుడు నేనెలా మర్చిపోగలనండీ!? అన్నీ మించిపోయాక! నా హృదయం అతుక్కోవడానికి కూడా వీల్లేకుండా ఛిద్రమైపోయాక!... మీరెన్ని తప్పుడు పనులు చేస్తున్నా సహించి ఊరుకోవడానికి, నేనేమీ పురాణ గ్రంథాల్లోని సీత - సావిత్రి - అనసూయ వంటి మహాపతివ్రతను గానండీ! నేనొక సామాన్య గృహిణిని!
[Pause....కొద్దిగా కోపం అసహ్యం కలుగుతుంది]
ఆ రోజు... ఆ రోజు... నీవు చేసిన తప్పులనన్నిటినీ నేను క్షమించాను. నా హృదయంలో మంటలు పెట్టవద్దని నిన్ను బ్రతిమాలుకుంటూ విలపించాను. కాని.. నువ్వు మగవాడిననే ధీమాతో నన్ను దూరంగా తోసిపారేశావు. ఈ దేశంలో ఆడదాని జీవితం మగవాడి జీవితంతో ముడిపడి, భర్త చేసే ప్రతి పిచ్చిపనికీ మలుపులు తిరిగి తిరిగీ ఆఖరికి భర్త చేతిరాత ఆమె నొసటి గీతగా మారి అంతరిస్తుంది. అందుకే నేనిప్పుడు నీవు నా నొసట రాసిన పిచ్చిగీతల్ని తలుచుకోకుండా ఉండలేను. జరిగిన ఏ విషయాన్నీ మర్చిపోలేను.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|