TeluguPeople
  are the trend-setters

 
Articles: Devotion
కార్తీక పురాణం
- Site Administrator
< < Previous   Page: 12 of 30   Next > >  
12వ అధ్యాయం ద్వాదశీ ప్రశంస మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. సాలగ్రామ దాన మహిమ పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు. ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు. నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు. ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను. ద్వాదశాధ్యాయం పన్నెండో రోజు పారాయణం సమాప్తం.

Be first to comment on this Article!

< < Previous   Page: 12 of 30   Next > >  



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.